Unnao Rape Case. (Photo Credits: IANS)

Lucknow, December 7: దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అత్యాచారా ఘటనలే కనిపిస్తున్నాయి. ఏ పేపర్ తిరగేసినా అవే వార్తలు కనిపిస్తున్నాయి. దిషా ఘటన(Justic For Disha)తో దేశ వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికిన సంగతి అందరికీ తెలిసిందే. నిందితులను ఉరి తీయాలని, ఎన్ కౌంటర్ చేయాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరూ గళం విప్పారు.

కాగా పోలీసులపై ఎదురుదాడికి దిగిన దిషా ఘటన నిందితులను తెలంగాణా పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎన్ కౌంటర్ చేశారు. ఈ విషయాన్ని సీపీ సజ్జనార్ (Cyberabad CP Sajjanar) మీడియా సమావేశంళో వెల్లడించారు. దీంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి.

అయితే ఉన్నావ్‌ అత్యాచార ఘటన(Unnao Rape Case Victim)లో బాధితురాలు శుక్రవారం మృతి చెందింది. 90 శాతం కాలిన గాయాలతో(95% burnt victim) రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఇప్పుడు ఈ సంఘటన దేశ వ్యాప్తంగా మళ్లీ ఆందోళనకు ఆజ్యం పోసేలా ఉంది.

గతేడాది డిసెంబర్‌లో ఉన్నావ్ లో ఈ మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో బాధిత మహిళ అప్పటి నుంచి న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉంది. న్యాయం కోసం విచారణ నేపథ్యంలో గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు.

కాలిన గాయాలతో బాధితురాలు కేకలు వేసుకుంటూ కిలోమీటరు వరకు పరుగులు పెట్టింది. అనంతరం ఆమెను లక్నోలో ఓ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్‌(Safdarjung Hospital)కు తరలించారు. అయితే, ఆమెను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

40 గంటలు మృత్యువుతో పోరాడి శుక్రవారం రాత్రి 11.40 గంటలకు తుది శ్వాస విడిచింది. అక్కడ చికిత్స తీసుకుంటూనే చనిపోయే ముందు బాధితురాలు మెజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.

బాధితురాలని పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేసిన ఓ నిందితుడు మరో వ్యక్తితో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదుచేయడంతో పోలీసులు కేసు నమోదుచేసిన ప్రధాన నిందితుడిని మార్చిలో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడు నవంబరు 25న బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు.

అనంతరం మరికొందరితో కలిసి ఆమెను హత్యచేయడానికి పథకం వేశాడు. కేసు విచారణలో భాగంగా రాయ్‌బరేలీలోని కోర్టుకు హాజరయ్యేందుకుగాను గురువారం ఉదయం బాధితురాలు బయలుదేరగా.. ఐదుగురు వ్యక్తులు కలిసి ఆమెపై దాడి చేశారు. కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న శివం త్రివేది, శుభం త్రివేది కూడా సజీవదహనానికి యత్నించినవారిలో ఉన్నారు.