Barabanki, July 28: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం (Uttar Pradesh road accident) చోటు చేసుకుంది. బారాబంకీలో లక్నో – అయోధ్య హైవేపై మంగళవారం అర్ధరాత్రి డబుల్ డెక్కర్ బస్సును ట్రక్కు (Barabanki Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో18 మంది అక్కడిక్కడే మృతి చెందగా.. 40 మందికిపైగా తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులంతా బిహార్ వాసులుగా పోలీసులు గుర్తించారు.
హర్యాణా నుంచి ప్రయాణికులతో ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు బిహార్ వెళ్తోంది. ఈ క్రమంలో బారాబంకి రామ్ స్నేహి ఘాట్ కొత్వాలి ప్రాంతంలోని లక్నో – అయోధ్య జాతీయ రహదారిపై బస్సు ఆగి ఉండగా.. లక్నో వైపు నుంచి వస్తున్న ట్రక్కు వేగంగా బస్సును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు.
రోడ్డు ప్రమాద సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు పీఎంఓ ట్వీట్ చేసింది. ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడినట్లు ప్రధాని ట్వీట్ చేశారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్‌లోని కిష్టావర్ ప్రాంతంలో భారీ వరదలు (Jammu Flodds) సంభవించాయి. కిష్టావర్‌లోని హంజార్‌లో బుధవారం ఉదయం ఒక్కసారిగా భారీ వరద పోటెత్తింది. వరదల ప్రభావంతో గ్రామంలోని చాలా ఇండ్లు కొట్టుకుపోయాయి. దీంతో నలుగురు మరణించారు. మరో 30 నుంచి 40 మంది గల్లంతయ్యారు. వరదల ధాటికి 9 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని కిష్టావర్ జిల్లా మేజిస్ట్రేట్ అశోక్ కుమార్ తెలిపారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెళికితీశామని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, భారత వాయు సేన కూడా ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటుందని వెల్లడించారు.