Lucknow, Mar 23: యూపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈనెల 18న అదృశ్యమైన మహ్మద్ ఇర్ఫాన్ (34) అనే వ్యక్తిని వ్యాపార భాగస్వామితో పాటు స్నేహితులు కలిసి దారుణంగా హత్య ( Friends kill man) చేశారు. అనంతరం ఆ మృతదేహాన్ని 30 ముక్కలుగా కోసి (chop body into 30 pieces) బులంద్‌షహర్-హపూర్ టోల్‌ప్లాజా సమీపంలోని ఖాళీ ప్లాట్‌లో పాతిపెట్టారు. హపూర్ పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి మృతుడి వ్యాపార భాగస్వామి మహ్మద్ రఘిబ్, స్నేహితుడు మహ్మద్ అఖిక్‌ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్న మజిద్ అలీ కోసం గాలింపు చేపట్టారు.
కాగా ఆర్ధిక లావాదేవీల వివాదంతో ఇర్ఫాన్‌ను అతడి స్నేహితులు దారుణంగా అంతమొందించారని పోలీసులు తెలిపారు. టోల్‌ప్లాజా వద్ద రెస్టారెంట్ నిర్వహించే స్నేహితుడు రఘిబ్ ఇర్ఫాన్ బిజినెస్‌లో పెట్టుబడి పెట్టాడు. వీరిద్దరూ కలిసి తాము లేని సమయంలో షాపును చూసుకునేందుకు మహ్మద్ అఖిబ్ అనే ఉద్యోగిని పనిలో పెట్టుకున్నారు. వ్యాపారంలో మరింత వాటా ఇవ్వాలని రఘిబ్ కోరడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
ఫాస్టాగ్ షాపును తనకు అప్పగించాలని లేదా తాను పెట్టుబడి పెట్టిన మొత్తం తిరిగి ఇవ్వాలని ఇర్ఫాన్‌ను రఘిబ్ కోరగా తిరస్కరించడంతో అతడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న వెంటనే తన స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేసి శవాన్ని 30 ముక్కలుగా చేసి పాతిపెట్టారు.
టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్స్ విక్రయించే షాపు నుంచి ఇర్ఫాన్ తిరిగిరాకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. ఇర్ఫాన్‌ను తాము చివరిగా రఘిబ్, అఖిబ్‌లతో చూశామని కుటుంబసభ్యులు చెప్పగా పోలీసులు వారిని తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. భూమిలోపలికి పాతిపెట్టడంతో మృతదేహం భాగాలను వెలికితీసేందుకు తాము జేసీబీని ఉపయోగించామని పోలీస్ అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.