Muzaffarnagar, April 14: దేశంలో మానవత్వం మంటగలిసిపోతోంది. చనిపోతుంటే వీడియోలు తీస్తూ పైశాచికానందం పొందుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్‌లో (Muzaffarnagar Shocker) దారుణ ఘటన జరిగింది. కోడలు తమ కళ్ల ముందే ఉరేసుకుని ప్రాణాలు తీసుకుటుంటే (Woman Hangs Herself to Death) రక్షించడం మానేసి అత్త మామలు కిటికీలో నుంచి వీడియో (In-Laws Make Video) తీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోమల్‌కు, ఆశిష్‌కు 2019లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కోమల్ తల్లిదండ్రులు 5 లక్షలు డబ్బు, ఒక బైక్‌ని కట్నం కింద ఇచ్చారు.
బాధితురాలు కోమల్.. డాటియానా గ్రామంలో భర్త ఆశిష్, అత్తమామలతో కలిసి ఉంటోంది. గత ఆరు నెలలుగా ఆశిష్ అమ్మానాన్నలు అదనపు కట్నం కావాలని, లేదంటే ఇంటి నుంచి వెళ్లిపోవాలని కోమల్‌ని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. భర్త కూడా తల్లిదండ్రులకే వత్తాసు పలికాడు.
వారి పోరు తట్టుకోలేని కోమల్ ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ ఊరి పెద్దలు నచ్చజెప్పడంతో ఇటీవల తిరిగి తన అత్తవారింటికి వచ్చింది. అయితే అత్తమామలు మళ్లీ తనని వేధించడం మొదలు పెట్టారు. దీంతో అత్తమామల వేధింపులు భరించలేక మనస్తాపంతో గదిలోకి వెళ్లి ఉరేసుకుంది.
అయితే కోడలు మృతికి తమకు సంబంధం లేదని, చెప్పుకునేందుకే నిందితులు ఆమె ఉరి వేసుకుంటున్న దృశ్యాలను తమ సెల్‌లో బంధించారు. అనంతరం ఆ వీడియోని సోషల మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త బయటికి రావడం, వైరల్ కావడంతో పోలీసులు అత్త మామలను అరెస్ట్ చేశారు.