Lucknow, Mar 16: ఉత్తరప్రదేశ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. భార్యతో గొడవ పడలేక..ఆమెతో వాదించలేక.. ఓ భర్త పదునైన ఆయుధంతో తన నాలుకను (man cuts off his tongue) కోసేసుకున్నాడు. గట్టి గట్టిగా అరుస్తున్న ఆమె నోరు మూయించలేక న మాట్లాడలేక ఈ నిస్సహాయ ఘటనకు ఒడిగట్టాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ జిల్లా గోపాల్ పూర్ కు చెందిన 27 ఏళ్ల ముఖేశ్, 24 ఏళ్ల నిషా దంపతులు. ముఖేశ్ ఓ రైతు. భార్యాభర్తలు ఎప్పుడూ గొడవలు పడుతుండేవారు. ఈక్రమంలో ఇటీవల కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో నిషా భర్తమీద కోప్పడి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ముఖేశ్ అత్తవారింటికి వెళ్లి భార్యకు సర్ధి చెప్పి ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. వచ్చాక కూడా అదే పరిస్థితి. ఏమాత్రం మార్పులేదు. ఇద్దరూ మళ్లీ మళ్లీ గొడవపడ్డారు. మాటా మాటా పెరిగింది. ఇద్దరూ అరుచుకున్నారు. దీంతో భార్య నిషా మరింతగా పెద్ద పెద్దగా అరిచింది.
ఇద్దరి మధ్యా వాగ్వాదం కాస్తా వాగ్యుద్ధానికి దారి తీసింది. గొడవ తీవ్రస్థాయికి చేరింది. నిషా ఎంతకీ తగ్గట్లేదు. దీంతో ముఖేశ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆమెతో వాదించడం శుద్ధ దండగ అని భావించాడు. అంతే ఆ ఆవేశంలో విచక్షణ మరిచిపోయాడు ఓ పదునైన వస్తువుతో తన నాలుక కోసేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ముఖేశ్ ను భార్యా..ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముఖేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఆస్పత్రికి వచ్చి విచారించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.