Fatehpur, december 16: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర ప్రదేశ్‌లో(Uttar Pradesh) ఉన్నావ్ ఘటన (Unnao Rape Case) మర్చిపోక ముందే ఆ రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. 18ఏళ్ల యువతిపై దుండగుడు అత్యాచారం చేసి ఆ తర్వాత నిప్పు(Teenager Raped And Set On Fire)పెట్టాడు.
90 శాతం గాయాలతో ఆస్పత్రిలో ఆ యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ సంఘటనకు పాల్పడిన 22 ఏళ్ల యువకుడైన నిందితుడు ఆమెకు దూరపు బంధువని తేలింది. ఫతేపూర్ జిల్లాలోని హుస్సైన్ గంజ్ ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
కాగా గతంలో యువతితో కలిసి నిందితుడు సన్నిహితంగా ఉండటంతో బంధువులు పట్టుకొని పంచాయితీ పెట్టారు. ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఇంట్లో యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఈ కిరాతకుడు లోపలికి ప్రవేశించి ఆమెపై ఘోరానికి పాల్పడి పెట్రోలు పోసి నిప్పంటించాడు. బాధితురాలిని కాన్పుర్ ఆస్పత్రిలో చేర్పించారు.
నేడు ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ ఘటనలో తీర్పు రానున్న నేపథ్యంలో మళ్లీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అక్కడ ప్రజలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వరుసగా చిన్నారులు, అమ్మాయిలు, మహిళలు అనే తేడా లేకుండా వరుసగా అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక యూపీలో రోజుకో తరహా ఘటన వెలుగుచూస్తోంది.