DEHRADUN, May 27: ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) ఉమ్మడి పౌరస్మృతిని (Uniform Civil Code) ప్రవేశ పెట్టాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో నిర్వహించిన ఓ సభలో మాట్లాడిన పుష్కర్ సింగ్ ధామీ (Pushkar singh dhami) ఈ ప్రకటన చేశారు. ‘రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code) ప్రవేశ పెట్టాలని నిర్ణయించాం. గోవా తర్వాత ఇటువంటి చట్టాన్ని అమలు చేయనున్న రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుంది. కుల, మత, వర్గాలకు అతీతంగా పౌరులు అందరికీ ఒకే చట్టం ఉండేలా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురానున్నాం’ అని ఆయన చెప్పారు.
దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ప్రవేశ పెట్టాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఇటీవల ఈ విషయంపై పలువురు ప్రముఖులు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలోనూ త్వరలోనే ఉమ్మడి పౌరస్మృతి ప్రవేశ పెడతామని ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ సీఎం జయరామ్ ఠాకూర్ కూడా ప్రకటించారు. అలాగే, దీనిపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా ఉమ్మడి పౌరస్మృతికి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ముస్లిం మహిళల ప్రయోజనాల దృష్ట్యా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలని అన్నారు. లేదంటే బహుభార్యాత్వం కొనసాగుతుందని చెప్పారు.
వారసత్వం, దత్తత, పెళ్లి, విడాకులు మొదలైన అంశాల్లో పౌరులు అందరికీ ఒకే చట్టం ఉండాలని పలువురు బీజేపీ (BJP)నేతలు డిమాండ్ చేశారు. అయితే, దేశంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య, కుదేలవుతోన్న ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి ప్రవేశ పెట్టాలన్న అంశాన్ని లేవనెత్తుతోందని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అంటోంది. ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగ విరుద్ధమని, మైనారిటీలకు వ్యతిరేకంగా జరుగుతోన్న కుట్ర అని ఆరోపిస్తోంది.