Chamoli, February 15: ఉత్తరాఖండ్‌లోని తపోవన్ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఉదయం మరో మూడు డెడ్ బాడీలను టన్నెల్ నుంచి వెలికితీసినట్లు చమోలి పోలీసులు తెలిపారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 54కు చేరిందని (54 Bodies Recovered) వెల్లడించారు. ఇంకా 150 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ నెల 7న ధౌలిగంగా వరదల్లో (Uttarakhand Glacier Burst) మొత్తం 204 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. మిగతా వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రాష్ర్ట విపత్తు బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. గత 9 రోజుల నుంచి అధికారులు రాత్రింబవళ్లు శ్రమిస్తూ మృతదేహాలను వెలికితీస్తున్నారు.
ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్ ఉత్పాతం వల్ల ఏర్పడిన శిథిలాలు ఒక ప్రవాహాన్ని అడ్డుకోవడంతో.. ఆ ప్రవాహం నిలిచిపోయి, అక్కడ తాత్కాలికంగా ఒక సరస్సు ఏర్పడిందని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ శాస్త్రజ్ఞులు తెలిపారు. జలవిలయం జరిగిన మర్నాడే హెలికాప్టర్ ద్వారా ఆ ప్రాంతంలో గగనతల సర్వే నిర్వహించిన శాస్త్రజ్ఞులు ఆ సరస్సును గుర్తించారు. ఆ శిథిలాలు తొలగిపోతే సరస్సులోని నీరంతా రిషిగంగ నదిలోకి ప్రవహించి మరోసారి ప్రమాదం జరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే ఆ సరస్సు పరిమాణాన్ని, అందులో ఎంత నీరుందనే విషయాన్ని, దానివల్ల ఎంతవరకూ ప్రమాదం ఉండొచ్చనే అంశాలను వారు పరిశీలిస్తున్నారు. ఆ సరస్సును పరిశీలించడానికి జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన ఎనిమిది మంది శాస్త్రవేత్తలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు చమోలీ జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రమాదం జరిగి ఇప్పటికే తొమ్మిది రోజులు గడిచిపోవడంతో వారి క్షేమంపై ఆందోళన వ్యక్తమవుతోంది.