Dehradun, October 19: పవిత్ర క్షేత్రం, దేవభూమి ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు (Uttarakhand Rains) ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీ వర్షాల వల్ల ఇప్పటి వరకు 16 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. వరుసగా మూడవ రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో నెలకొన్న పరిస్థితిపై ప్రధాని మోదీ (PM Narendra Modi), కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు సమీక్షించారు. ఇండ్లు, బ్రిడ్జ్‌లు ధ్వంసం అయ్యాయని, ఇప్పటి వరకు 16 మంది మృతిచెందారని, రెస్క్యూ ఆపరేషన్ కోసం మూడు ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్లు ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి ( CM Pushkar Singh Dhami) తెలిపారు.
అయితే ఇవాళ రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షం తగ్గుతుందని వాతావరణ శాఖ చెప్పింది. నిరాటంకంగా కురుస్తున్న వానల వల్ల .. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి అయోమయంగా తయారైంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న ఉత్తరాఖండ్ భీకర వర్షం ధాటికి తల్లడిల్లింది. అందమైన నైనిటాల్‌లో సరస్సు ఉప్పొంగడంతో రోడ్లు అన్నీ నీట మునిగాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదలకు పలుచోట్ల వంతెనలు, రహదారులు, రైల్వేట్రాక్‌లు ధ్వంసమవుతున్నాయి. గౌలా నది వరద ఉధృతికి ఈ ఉదయం ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ వద్ద కత్కోడామ్-ఢిల్లీ రైల్వే లైన్ దెబ్బతిన్నది. ట్రాక్ కింద మట్టి, కంకర పూర్తిగా కొట్టుకుపోయాయి. దాంతో రైల్వేట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. ట్రాక్ ధ్వంసం కావడంతో అధికారులు ఆ మార్గం గుండా వెళ్లే రైళ్ల రాకపోకలను నిలిపేశారు.
నలుగురు హైదరాబాద్ యువతులు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్నారు. వారు ఉంటున్న భవనాన్ని వరద చుట్టుముట్టడంతో వారు భవనంపైకి చేరారు. ఆ యువతులు గత మూడ్రోజులుగా భవనంపైనే ఉంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించి, అధికారులను అప్రమత్తం చేశారు. కిషన్ రెడ్డి బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మంత్రి ఆదేశాలతో సహాయచర్యలు వేగవంతం చేశారు. రెస్క్యూ బృందం ఎంతో శ్రమించి ఆ నలుగురు హైదరాబాద్ యువతులను కాపాడింది. అనంతరం వారిని ఢిల్లీకి తరలించారు.