Online Horror:  పోర్న్‌వెబ్ సైట్లలో బాధితురాలు 'దిశ' పేరు ట్రెండింగ్, ఆ పేరుతో వీడియోల కోసం ఇండియా, పాకిస్థాన్ నుంచి విపరీతంగా శోధన, వెగటు పుట్టిస్తున్న మనుషుల విషపు ధోరణి
Hyderabad Rape Victim's Name Searched on Porn Sites. (Photo Credits: Twitter)

New Delhi, December 2:  ఈరోజు దేశంలో ఏ మూల చూసినా తీవ్రమైన ఆగ్రహావేశాలు, క్యాండిల్ మార్చ్ నిరసనలు. నిందితులను నడిరోడ్డుపై చంపేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు. షాద్ నగర్ లో 26 ఏళ్ల వెటర్నరీ డాక్టర్ 'దిశ' (Disha) దారుణ ఘటన పట్ల దేశ ప్రజల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహ జ్వాలలు ఇవి. అయితే ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. షాద్‌నగర్ ఘటన (Shadnagar Incident) సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. అయితే దానితో పాటే సిగ్గుపడాల్సిన ఒక వార్త మళ్లీ ఇక్క చెప్పుకోవాల్సి రావడం, వినాల్సి రావడం దురదృష్టకరం.

సోషల్ మీడియా (FB, Twitter, Helo etc) కారణంగా యువతి ఫోటోలు, అసలు పేరు, ఇంటి పేరుతో సహా బయటకు వచ్చి కొద్ది సమయంలోనే విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో భారత్, పాకిస్థాన్ నుంచి లక్షల కొలదీ యూజర్లు యువతి రేప్ కు సంబంధించిన వీడియోస్ (Rape Videos) ఏమైనా దొరుకుతాయేమో అనే చిల్లర ఆశతో పోర్న్ వెబ్ సైట్లలో విపరీతంగా శోధన చేశారు. ఈ కారణంతో పోర్న్ వెబ్ సైట్లలో ఇండియా, పాకిస్థాన్ లో ఆ పేరు టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది.

నెటిజన్ల ఈ అసహ్యకరమైన చర్య మరింత వెగటుబుట్టించేలా చేస్తుంది. ఒక వ్యక్తి అత్యాచారానికి గురైనట్లు నిర్ధారణ అయితే ఆ వ్యక్తికి సంబంధించిన పేరు, ఫోటో, ఎలాంటి వ్యక్తిగత వివరాలను ఉపయోగించకూడదు. కనీసం కుటుంబ సభ్యుల పేర్లను ఉపయోగించినా శిక్షార్హమే.  బాధితురాలి అసలు పేరుతో నెటిజన్లు, సెలబ్రిటీలు ఇష్టమొచ్చినట్లు పోస్టులు చేయడం ద్వారా విపరీతమైన ప్రాచుర్యంలోకి వచ్చింది.

దీంతో పోలీసులు యువతి పేరును 'దిశ' గా నామకరణం చేస్తూ ఆ పేరును మాత్రమే వాడాలని ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు సుప్రీంకోర్టు కూడా గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఆ చట్టాలను ఉల్లంఘిస్తూ, ఎవరైనా బాధితురాలి అసలు పేరు, ఫోటో లేదా ఇఅత వివరాలు ఉపయోగించినా, పోస్ట్ చేసినా లేదా ప్రచురించినా ఐపిసి సెక్షన్ 228ఎ (Section 228A) ప్రకారం కనీసం రెండేళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది.

కాగా, ఇంతటి ఘోరం జరిగినపుడు బాధితురాలి పట్ల సానుభూతి, ఆ కుటుంబానికి ధైర్యాన్ని నూరిపోసేలా చర్యలు ఉండాలే తప్ప వారిని మరింత క్షోభకు గురిచేయడం క్షమించరాని నేరం. ఇప్పుడు ఈ ఘటనలో ఆ నలుగురు నిందితులు భౌతికంగా లైంగికదాడి చేసి రేపిస్టులు అని పిలువబడితే ఇలాంటి వికృత చర్యలకు పాల్పడటం కూడా మానసికంగా అత్యాచారం చేసే వారే అవుతారు.

నెటిజన్ల ఈ చర్యలతో కొన్ని వర్గాలు, మహిళా సంఘాల్లో ఆగ్రహం మరింత పెరిగింది. నిందితులతో పాటు ఇలాంటి వారికి కఠిన శిక్షలు విధించాలంటూ కొత్తగా డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి పేర్లను, ఫోటోలను ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో ఆన్ లైన్ లో పోస్టులు పెట్టే వారి పట్ల చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.