Panaji, JAN 28: గోవా పర్యాటకుల (Goa tourisam) ప్రైవసీని, సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని అక్కడి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. గోవాను సందర్శించే పర్యాటకులు అసంతృప్తికి గురవకుండా, మోసపోకుండా ఉండేందుకు గోవా ప్రభుత్వం కఠిన చర్యలు (New Rules) చేపట్టింది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు తమ పర్యటన చిరస్మరణీయంగా ఉండేలా మలుచుకునేందుకే కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఈ మార్గదర్శకాలను గోవా పర్యాటక శాఖ జనవరి 26 వ తేదీన జారీ చేసింది. సన్ బాత్ చేస్తున్నప్పుడు లేదా సముద్రంలో సరదాగా గడుపుతున్న వారి ఫొటోలు తీయడానికి (Clicking Selfies) ముందస్తుగా వారి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో వంట చేయడం కూడా నిషేధించారు.
ఈ నిబంధనలు ఉల్లంఘించే వారికి రూ.50 వేల వరకు జరిమానా విధించనున్నారు. బీచ్‌లో బహిరంగంగా మద్యం (Drinking alchohal) సేవించే వారిపై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనున్నరు. ప్రమాదాలను నివారించేందుకు ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
అంతే కాకుండా గోవాలోని చారిత్రక కట్టడాలను పాడుచేయవద్దని పర్యాటకులకు గోవా ప్రభుత్వం (Goa) విజ్ఞప్తి చేస్తున్నది. అధిక ఛార్జీలను నివారించేందుకుగాను పర్యాటకులు తప్పనిసరిగా టాక్సీ మీటర్ ప్రకారం చెల్లించాలని కోరుతున్నది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు పర్యాటక శాఖలో నమోదు చేసుకున్న హోటళ్లలోనే బస చేయాలని కూడా మార్గదర్శకాల్లో సూచించింది. ఇలా బస చేయడం వల్ల పర్యాటకుల భద్రతతోపాటు వారికి ప్రైవసీకి భంగం కలుగకుండా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంటున్నది. ఏటా గోవాకు పెద్ద సంఖ్యలో దేశ, విదేశీ పర్యాటకులు వస్తుంటారు. దొంగిలించిన బైక్ లేదా కారును తక్కువ ధరకు విక్రయించడానికి ప్రయత్నించే దుండగుల పట్ల పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని కొత్త గైడ్‌లైన్‌లో సూచించారు.