Dubbaka By-poll 2020: దుబ్బాక ఉపఎన్నికకు ప్రారంభమైన పోలింగ్, కరోనా నిబంధనలు అమలు, మాస్క్ ఉంటేనే అనుమతి, సాయంత్రం 6 వరకు జరగనున్న పోలింగ్
Dubbaka By-poll (Image-PTI)

Dubbaka, November 3: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీకి జరుఫుతున్న ఉపఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం 6 వరకు జరగనుంది. కరోనా కారణంగా పోలింగ్ సమయాన్ని గంట పెంచారు. కరోనా ఉన్నప్పటికీ పెద్దఎత్తున ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే కొవిడ్ నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు, ఒకే దగ్గర జనం గుమిగూడకుండా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచారు. మొత్తం 315 కేంద్రాలలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాస్క్ ఉంటేనే లోపలికి అనుమతి ఇస్తున్నారు. శానిటైజర్, గ్లౌజులు కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నవారికి స్లిప్పులు ఇచ్చి చివరి గంటలో ఓటువేసేందుకు అనుమతిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. కరోనా నిబంధనల్లో భాగంగా సీనియర్ సిటిజన్స్ కు ఇంటి నుంచే ఓటువేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 1.98 లక్షల ఓటర్లు ఉన్నారు.

పోలింగ్ సజావుగా సాగేందుకు అధికారులు  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు, నియోజకవర్గం పరిధిలో మొత్తం 89 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

తెరాస ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ ఏర్పడటంతో దుబ్బాక అసెంబ్లీకి ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నిక బరిలో ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులతో పాటు ఇతరులు మరియు స్వతంత్రులు కలిపి మొత్తం 23 మంది పోటీపడుతున్నారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మరియు బీజేపీ నుంచి బరిలో ఉన్న ఎం రఘునందన్ రావుల మధ్యే అసలైన పోటీ జరుగుతుంది.

ఈ ఉపఎన్నికకు ముందు అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీకి అభ్యర్థికి సన్నిహితుల దగ్గర్నించి భారీ మొత్తంలో నగదు పట్టుబడటంతో ఈ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అలా రెండు సార్లు పట్టుబడటంతో తెరాస- బీజేపీ- కాంగ్రెస్ నేతల మాటల తూటాలు, సంచలన ప్రకటనలు, సవాళ్లతో చలికాలంలో దుబ్బాక ఉపఎన్నిక రాజకీయ వేడిపుట్టించింది.

నవంబర్ 10న దుబ్బాక ఫలితం తేలనుంది.