New Delhi, March 24: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగమమవుతోంది. ఆయనే తన వారసుడని ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బొబ్డే సిఫారసు చేశారు. జస్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వారసుడి పేరును (Chief Justice of India) సిఫారసు చేయాలని ప్రభుత్వం సీజేఐని కోరిన సంగతి తెలిసిందే. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం జస్టిస్ బాబ్డేకు ఓ లేఖ రాసినట్లు విశ్వసనీయ సమాచారాన్ని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ వెల్లడించింది.
జస్టిస్ బోబ్డే (SA Bobde) ప్రతిపాదనను కేంద్ర న్యాయ శాఖ హోంశాఖకు పంపనుంది.హోంశాఖ పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోదంతో సీజేఐ ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది. అన్నీ కుదిరితే ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వీ రమణ దేశ అత్యున్నత న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు.
కాగా సుప్రీంకోర్టులో జస్టిస్ బోబ్డే తరువాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana). 1957 ఆగస్టు 27న ఏపీలోని కృష్ణా జిల్లాలో జన్మించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమణ బీఎస్సీ, బీఎల్ చదివారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్), ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు పానెల్ కౌన్సిల్ గా ఉన్నారు. క్యాట్‌లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరఫున పనిచేశారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు.
2000 సంవత్సరం జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకూ ఏపీ హైకోర్టు యాక్టింగ్ ఛీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. 2013 సెప్టెంబరు 2న దిల్లీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. అనంతరం 2014 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Here's Bar & Bench Tweet
Chief Justice of India SA Bobde clears way for Justice NV Ramana to be appointed as the 48th Chief Justice of India.
CJI Bobde who is due to retire on April 23 has recommended Justice NV Ramana's name to Law Ministry to be appointed as the next CJI. #SupremeCourt pic.twitter.com/9zXXIz8nqS
— Bar & Bench (@barandbench) March 24, 2021
గతేడాది అక్టోబర్‌లో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి.. ఎన్వీ రమణపై అవినీతి ఆరోపణలు చేస్తూ సీజేఐకి లేఖ రాశారు. అమరావతిలో ఆయనతోపాటు ఆయన బంధువులు భూ సేకరణ విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు జగన్ ఆరోపించారు. అంతేకాకుండా ఏపీ హైకోర్టులో జరుగుతున్న విచారణలను ప్రభావితం చేసి తన ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర కూడా చేస్తున్నట్లు జగన్ ఆ లేఖలో చెప్పారు. దీనిపై విచారణ జరపాలని ఆయన కోరారు.
ఇదిలా ఉంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా)కి 25 ఏళ్లు నిండిన సందర్భంగా సోమవారం రజతోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్వీ రమణ నల్సాకు చైర్మన్ హోదాలో కీలక ప్రసంగం చేశారు.నల్సా ఉద్దేశాలను, లక్ష్యాలను లాయర్లకు వివరిస్తూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారతదేశం ఆధునికతను సంతరించుకుంటూ అత్యంత వేగంగా ముందుకు పోతున్నదని తరచూ మనం వింటుంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా పలు రంగాల్లో మనం ఎంతగానో ముందుకు వెళ్లామని దేశ, విదేశాల్లో అనేక వేదికలపై చర్చించుకుంటాం. అయితే ఈ విజయగాథ వెనుక మరో కోణం కూడా ఉంది. న్యాయ రంగానికి సంబంధించినంత వరకు పరిస్థితి మరోలా ఉందన్నది కాదనలేని వాస్తవం. స్వాతంత్ర్యం పొంది 74 ఏళ్లు అవుతున్నా మన దేశంలో ఇప్పటికీ కొన్ని లక్షల మందికి కనీస న్యాయ సహాయం అందడంలేదు తద్వారా వారికి సరైన న్యాయం దక్కడంలేదన్నది చేదు నిజమని తెలిపారు.
వేగాన్ని అందిపుచ్చుకున్న ప్రస్తుత ఆధునిక కాలంలో ‘అందరికీ న్యాయం దక్కాలి' లాంటి చర్చను అదేదో పాతబడిన అంశంగా భావిస్తున్నారు. కానీ ఇవాళ్టికి కూడా కొన్ని లక్షల మంది పేదలు ప్రాథమిక హక్కులు కూడా లేకుండా, కనీస న్యాయ సహాయం కూడా అందని దుస్థితిలో ఉన్నారు. ఇది నిజంగా అత్యంత విచారకరం. ఈ పరిస్థితికి ప్రధానంగా రెండు కారణాలని చెప్పొచ్చు. ఒకటి పేదరికం, రెండు నిరక్ష్యరాస్యత. ఈ జంట సమస్యల సుడిలో ‘కనీస న్యాయం' చిక్కుకుపోయినట్లు గుర్తించామని అన్నారు.
దేశంలోని పేద ప్రజలకు కనీస న్యాయ సహాయం దక్కడంలేదనే వాస్తం విచారకరమే అయినా, దాన్ని మనం డీమోటివేట్ చేసే అంశంగా భావించొద్దు. జాతీయ నేతలను గుర్తు చేసుకూంటూ, సమాజం పట్ల, పేదల పట్ల మన కర్తవ్యాన్ని నిరవేర్చుతూ ముదుకెళ్లాలి. న్యాయవాదులైన మిత్రులకు ఓ విషయం చెప్పదల్చుకున్నాను. గాంధీ, నెహ్రూ, పటేల్ లాంటి దేశనేతల వారసులమమైన మనం సమాజం పట్ల మన కర్తవ్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని తెలిపారు.
నల్సా రజతోత్సవం సందర్భంగా ఓ ముఖ్యమైన మాటతో నేను ముగిస్తాను. దయచేసి లాయర్లందరూ సమాజంలో బలహీనమైన వారి గొంతుకను వినండి. న్యాయం కోసం డబ్బులు చెల్లించలేని వారి దుస్థితిని అర్థం చేసుకోండి. మీకు వీలైనప్పుడల్లా పేదలకు న్యాయ సహాయం చేయండి. లాయర్లు దేశానికి ఏదైనా తిరిగివ్వగలరంటే అది డబ్బులు తీసుకోకుండా పేదలకు న్యాయ సేవ చేయడం ద్వారానే సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను. కోవిడ్ -19 విలయ కాలంలో నేషనల్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీ ఆదిశగా చాలా వరకు పాటుపడింది. రాబోయే రోజుల్లో పేదలకు మరింత న్యాయ సహాయం అందేలా నల్సా దృష్టిపెట్టింది'' అని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.