![](https://test1.latestly.com/wp-content/uploads/2021/12/COVID-19-In-Delhi.jpg)
New Delhi, Dec 28: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసిన కేజ్రీ సర్కారు.. మరిన్ని ఆంక్షలను (COVID-19 Restrictions In Delhi) విధిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా దిల్లీలో పాజిటివిటీ రేటు 0.5శాతం కంటే ఎక్కువగా ఉంటోంది. అందువల్ల, వైరస్ కట్టడికిగానూ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవల్ -1(ఎల్లో అలర్ట్)ను అమలు చేయాలని (Yellow Alert COVID-19 Restrictions Imposed In Delhi) నిర్ణయించామని తెలిపారు.
ఇందులో భాగంగా మరిన్ని ఆంక్షలు విధిస్తున్నామని కేజ్రీవాల్ (Arvind Kejriwal) తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. బాధితుల వ్యాధి తీవ్రత స్వల్పంగానే ఉందని ఆయన అన్నారు. ఆక్సిజన్ వినియోగం, వెంటిలేటర్ల అవసరం కూడా పెరగలేదన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తాము గతంలో కంటే 10 రెట్లు ఎక్కువ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ప్రజలంతా తప్పకుండా కొవిడ్ నిబంధనలను పాటించాలని, మాస్క్‌లు, భౌతికదూరం వంటివి మరవొద్దని కోరారు.
ఇక ఇప్పటివరకు అక్కడ 165 మంది కొత్త వేరియంట్ బారినపడ్డారు. ఇక గడిచిన 24 గంటల్లో 331 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. జూన్ 9 తర్వాత దిల్లీలో ఒక రోజులో ఈ స్థాయిలో కేసులు రావడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఎల్లో అలర్ట్‌తో అమల్లోకి రానున్న ఆంక్షల వివరాలు
* సినిమా హాళ్లు, మల్టిప్లెక్స్‌లు, ఆడిటోరియంలను పూర్తిగా మూసివేస్తారు.
* జిమ్‌లు, స్పా సెంటర్లు, యోగా ఇనిస్టిట్యూట్‌లు మూతబడుతాయి.
* స్కూళ్లు, విద్యా సంస్థలు, కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లు తెరవడానికి అనుమతి లేదు.
* సామాజిక, రాజకీయ, మతపరమైన సామూహిక కార్యక్రమాలు, సభలు, సమావేశాలపై నిషేధం ఉంటుంది.
* హోటళ్లు తెరుచుకోవచ్చు. అయితే బాంకెట్ హాల్స్, కాన్ఫరెన్స్ హాళ్లను తెరిచేందుకు వీల్లేదు.
* రెస్టారంట్లను 50శాతం సామర్థ్యంతో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తెరుచుకోవచ్చు. బార్లు 50శాతం సామర్థ్యంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరవాలి.
* దిల్లీ మెట్రో 50శాతం సామర్థ్యంతో నడుస్తుంది. మెట్రోలో నిల్చుని ప్రయాణం చేసేందుకు అనుమతి లేదు.
* ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించే బస్సులను కూడా 50శాతం సామర్థ్యంతో నడపాలి.
* ఆటోలు, టాక్సీలు, ఈ-రిక్షాల్లో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి.
* క్రీడా ప్రాంగణాలు, స్టేడియంలు, స్విమ్మింగ్ పూల్స్‌ను మూసివేయాలి.
* ప్రైవేటు కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 50శాతం సామర్థ్యంతో నిర్వహించేందుకు అనుమతి ఉంటుంది.
* పబ్లిక్ పార్కులు తెరిచే ఉంటాయి.
* అవుట్‌డోర్ యోగాకు అనుమతి ఉంది. సెలూన్లు, బ్యూటీ పార్లర్లు తెరుచుకోవచ్చు.
* అత్యవసరం కాని మాల్స్, దుకాణాలు సరి-బేసి పద్ధతిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరుచుకోవాలి.
* రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
* పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో 20 మంది మాత్రమే పాల్గొనాలి.