వైసీపీ అధినేత జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో వారి తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు వైఎస్‌ఆర్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ‘‘జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. అబద్ధాల పరంపర కంటిన్యూ కాకూడదు. ఈ ఘటనలు నా పిల్లలిద్దరికే కాదు.. రాష్ట్రానికీ మంచిది కాదు’’ అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
లేఖలో ఆమె ఏం రాశారంటే.. ‘‘రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన. ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మనసుకి చాలా బాదేస్తోంది. తెరిచిన పుస్తకం అని రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ అనేవారు. అయితే ఇలా కాదు. చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్లం. కానీ, నేడు ఆదుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివి అన్నీ నా కళ్ళముందే జరిగి పోతున్నాయి. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. అబద్ధాల పరంపర కొనసాగుతోంది. తెలిసి కొంత తెలియక కొంత మాట్లాడుతున్నారు. అవి దావానలంలా ఎక్కడెక్కడికో పోతున్నాయి.
YS VIjayamma Open Letter To YSR Fans on Recent Issues
వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆస్తుల గొడవ గురించి మొదటి సారి స్పందించిన వైఎస్ విజయమ్మ..
నా కుటుంబానికి దిష్టి తగిలండంటూ ఎమోషనల్ బహిరంగ లేఖ ..@realyssharmila @ysjagan @YSRCParty @JaiTDP#ysvijayamma #letter #yssharmila #YSJaganMohanReddy #YSRCP #RTV pic.twitter.com/Dvrx5F8N4P
— RTV (@RTVnewsnetwork) October 29, 2024
ఇవి కంటిన్యూ అవ్వకూడదు. నా పిల్లలిద్దరికీ కాదు.. చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. నేను మీ ముందుకు ఈ విషయంపై రాకూడదని అనుకున్నా. అయినా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే వారందరినీ ఒకటి అడుగుతున్నా... ఈ కుటుంబాన్ని ప్రేమించిన వారు మీరు. మా జీవితంలో మీరందరూ భాగమే అనుకుంటున్నాను. ఇది రాజశేఖర్ రెడ్డి కుటుంబం. ఆయనకు మేము ఎంతో.. మీరు కూడా అంతే. ఆయన మమ్మల్ని ఎలా ప్రేమించారో.. మిమ్మల్ని అంతగానే ప్రేమించారు. మీరు కూడా అంతకంటే ఎక్కువగా మా కుటుంబాన్ని ప్రేమించారు.
అంతెందుకు.. రాజశేఖర్ రెడ్డి మన మధ్య నుంచి వెళ్లిపోయాక నా పిల్లలను, ఆయన ఉన్నప్పటి కంటే ఎక్కువగా ప్రేమించి, ఆదరించి అక్కున చేర్చుకున్నారు. అది నేను ఎన్నటికీ మరిచి పోలేను. అందుకు నా జన్మంతా మీకు రుణపడి ఉంటూ.. హృదయ పూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను. మీ అందరికీ మీ ఆడబిడ్డగా రెండు చేతులు ఎత్తి మనవి చేసుకుంటున్నా.
దయచేసి ఈ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దు. దూషణలు చేయవద్దు. ఈ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దు. మీరెవరు రెచ్చ గొట్టవద్దని నా మనవి. నేను నమ్మిన దేవుడు యేసయ్య.. సమాధాన కర్త. నా బిడ్డల సమస్యలకు పరిష్కారం ఇస్తాడని నా నమ్మకం’’ అని లేఖలో పేర్కొన్నారు.