VJy, Oct 29: పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారమా చంద్రబాబు అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమీ పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తుచేశారు. నోటిఫై చేసిన ప్రతీ పంటకు సాగైన ప్రతీ ఎకరాకు యూనివర్శల కవరేజ్ కల్పిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో అమలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్ సాకారం, ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన అదానీ గ్రూప్ సంస్థల అధినేతలు
అధికారంలోకి ఐదు నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20వేల పెట్టుబడి సాయంలో ఒక్కపైసా కూడా అందించలేదని.. ఇప్పుడేమో పంట బీమా ప్రీమియం భారాన్ని రైతుల నెత్తినే మోపారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల ఉసురు తీసుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ హితవు పలికింది. తమ ప్రభుత్వ హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్ల పాటు ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేశామని వైసీపీ తన అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో తెలిపింది.
YS Jagan Tweet
రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారమా @ncbn ? pic.twitter.com/J2jW6kLqyA
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 29, 2024
YSRCP Tweet
‘చంద్రబాబూ..! రైతుల ఉసురుపోసుకోవద్దు’
1. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్ల పాటు ఉచిత పంటల బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేసాం.
2. నోటిఫై చేసిన ప్రతీ పంటకు సాగైన ప్రతీ ఎకరాకు యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో బీమా రక్షణ… https://t.co/KwjhzGMNrx
— YSR Congress Party (@YSRCParty) October 29, 2024
నోటిఫై చేసిన ప్రతీ పంటకు సాగైన ప్రతీ ఎకరాకు యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో బీమా రక్షణ కల్పించామని చెప్పింది. తమ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రైతులపై పైసా భారం పడకుండా 5.52 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించామని.. 2.04 కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పించామని పేర్కొంది.
తమ ప్రభుత్వ హయాంలో ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి సంబంధించి పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభంలో రైతుల ఖాతాలో జమ చేస్తూ వారికి అండగా నిలిచామని వైసీపీ తెలిపింది. 2014–19 మధ్య మీ ప్రభుత్వ హయాంలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల పరిహారం చెల్లిస్తే.. తమ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 54.55 లక్షల మందికి రూ.7,802.08 కోట్ల బీమా పరిహారాన్ని నేరుగా వారి ఖాతాలకు జమ చేశామని చెప్పింది. రైతుల తరపున ఐదేళ్లలో రూ.3,022.26 కోట్ల ప్రీమియం మొత్తాన్ని మా ప్రభుత్వం బీమా కంపెనీలకు చెల్లించిందని తెలిపింది.
గతంలో బీమా చేయించుకున్న వారు సైతం పరిహారం కోసం అధికారులు, బీమా కంపెనీల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగేవారని వైసీపీ తెలిపింది. 2023–24 సీజన్‌లో రైతుల తరపున ప్రీమియం మొత్తం రూ.930 కోట్లు ఈ జూన్‌లో మీరు చెల్లించకుండా ఎగ్గొట్టడం వలన ఆ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులతో పాటు, భారీ వర్షాలు, తుపాన్‌ల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు రూ.1,385 కోట్ల పరిహారం అందకుండా పోయిందని చెప్పింది. ఇచ్చిన మాటకు మించి మూడు విడతల్లో ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందించి సాగు వేళ రైతులకు అండగా నిలిచామని పేర్కొంది.
వైఎస్సార్ రైతు భరోసా కింద ఐదేళ్లలో 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288.17 కోట్లు నేరుగా రైతుల ఖాతాలకు జమ చేసి వారికి వెన్నుదన్నుగా నిలిచామని వైసీపీ తెలిపింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో ఆర్బీకే వ్యవస్థను ఏర్పాటు చేసి, వాటి ద్వారా విత్తు నుంచి విక్రయం వరకు రైతులను చేయి పట్టి నడిపించామని పేర్కొంది. తొలిసారిగా ఈక్రాప్ ద్వారా సాగు చేసిన ప్రతి ఎకరాలో సాగైన ప్రతి పంటను నమోదు చేస్తూ, ఈ క్రాప్ ప్రామాణికంగా రైతు క్షేత్రం వద్ద వారు పండించిన పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ వెన్నుదన్నుగా నిలిచామని చెప్పింది. ఈ క్రాప్ ప్రామాణికంగా పంట రుణాలు అందించడమే కాదు, పంటల బీమా, పంట నష్ట పరిహారం, సున్నా వడ్డి రాయితీ వంటి సంక్షేమ ఫలాలు అందించామని తెలిపింది.
ఐదేళ్లుగా రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడం రైతులకు నువ్వు చేస్తోన్న ఘోరమైన అన్యాయమని చంద్రబాబుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలే పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులపై పంటల బీమా ప్రీమియం భారం మోపడం భావ్యం కాదని హితవు పలికింది. రైతులను బాధపెట్టిన వారు బాగుపడినట్టుగా చరిత్రలో ఎక్కడా లేదని. వాళ్ల ఉసురుపోసుకోవద్దని సూచించింది. ఉచిత పంటల బీమా పథకం రద్దు చేసే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. రైతుల తరపున ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించాలి. లేకుంటే రైతులు ఎప్పటికీ నిన్ను క్షమించరని స్పష్టం చేసింది.