New Delhi, July 18: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసు చాలా కీలకమైన అంశమని తెలిపిన ధర్మాసనం... వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ ను సెప్టెంబర్ 2వ వారానికి వాయిదా వేసింది.అలాగే ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ కూడా అదే రోజుకు వాయిదా వేసింది.
గంగిరెడ్డి పిటిషన్‌నూ అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్‌కు జత చేస్తూ.. సెప్టెంబర్ రెండో వారంలో విచారణ చేపడతామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్‌పై కౌంటర్ దాఖలుతోపాటు వివేకా హత్య కేసు వివరాలు, డైరీ సీల్డ్ కవర్‌లో అందించాలని సీబీఐని ఆదేశించింది. జూన్ 30న దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సుప్రీంకోర్టు సూచించింది.
గంగిరెడ్డికి వెంటనే బెయిల్ మంజూరు చేయాలంటూ.. అతడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా గంగిరెడ్డి న్యాయవాదిపై ధర్మాసనం ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఇది హత్య కేసు.. బెయిల్ వ్యవహారాలు ఆచితూచి ఉంటాయి. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. బెయిల్ కోసం వేచి చూడాల్సిందే’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్‌తో జతచేయొద్దన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. గంగిరెడ్డికి జూన్ 30న బెయిల్ ఇవ్వాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై గతంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇప్పుడు ఆ ఆదేశాలు కొనసాగుతాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.