YS Vivekananda Reddy (Photo Credits: Facebook)

CBI Files Final chargesheet in Viveka Murder case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు (Viveka Murder Case) దర్యాప్తుపై సీబీఐ(CBI)కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులు, అనుమానితులను పలు మార్లు విచారించింది సీబీఐ. విచారణకు వచ్చిన వారందరి స్టేట్‌మెంట్లు రికార్డు చేసింది. ఇప్పటివరకు దాఖలైన ఛార్జ్ షీట్ల సంఖ్య చూస్తే ఇవ్వాళ్టిది మూడోది.

2021లో తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ 2022 జనవరిలో సప్లమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తాజాగా 2023 జూన్ 30 ఫైనల్ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి నిందితుల రిమాండ్ ముగియటంతో సీబీఐ అధికారులు వారిని కోర్టులో హాజరు పర్చారు . అయితే వీరికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించిన సీబీఐ కోర్టు.. కేసు విచారణను జులై 14 కు వాయిదా వేసింది.

వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, తక్షణమే విచారణ అధికారిని మార్చేయాలని తెలిపిన అత్యున్నత ధర్మాసనం

ఇక ఇదే కేసుకు సంబంధించి వివేకానందరెడ్డి తనయ సునీత వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జులై 3 న విచారించనుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సునీత పిటిషన్‌ వేయగా.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం విచారించింది. ఈ కేసును జులై 3న తదుపరి విచారణ కోసం చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు లిస్ట్ చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి సిబిఐతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ రోజుతో సిబిఐకి ఇచ్చిన విచారణ గడువు ముగియడంతో సునీత పిటిషన్‌కు ఎంత వరకు వాలిడిటీ ఉంటుందన్నది జులై 3న తేలనుంది.

వివేకానందరెడ్డి హత్య కేసు, ముగిసిన అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ, తనకు తెలిసిన వాస్తవాలే సీబీఐకి చెప్పానని తెలిపిన కడప ఎంపీ

ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy) ముందస్తు బెయిల్‌ రద్దుకు వివేకా కుమార్తె సునీత వేసిన పిటిషన్‌పై జులై3న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. నిందితుడు భాస్కర్‌రెడ్డి, ఒకరిద్దరిపై త్వరలో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. జులై 3న సుప్రీంకోర్టుకు కేసు దర్యాప్తు పురోగతి సీబీఐ వివరించి సమయం కోరే అవకాశముందని సమాచారం.

నేడు సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసుపై విచారణ జరిగింది. నిందితుల రిమాండ్‌ గడువు ముగియడంతో భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలను చంచల్‌గూడ జైలు నుంచి సీబీఐ కోర్టుకు తరలించారు.వీరి రిమాండ్‌ను జులై 14 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.