Zerodha: బరువు తగ్గితే రూ. 10 లక్షలు మీ సొంతం, అయితే దీన్ని సొంతం చేసుకోవాలంటే మీరు జెరోడా కంపెనీలో ఉద్యోగం చేయాల్సిందే
Nithin Kamath (Photo-File Image)

Zerodha Boss Sets Fitness Challenge for employees: జెరోడా అనే ఆన్‌లైన్‌ బ్రోకరేజీ కంపెనీ ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టింది. ఇందులో భాగంగా ఆ సంస్థ వారికి బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు బరువు పెరిగి అనారోగ్యం బారినపడుతున్నట్టు పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి అనారోగ్య సమస్యలు వారి దరి చేరకూడదని భావించిన ఆన్‌లైన్ బ్రోకరేజీ సంస్థ జెరోధా ఉద్యోగుల కళ్లలో సంతోషం నింపే ప్రకటన చేసింది. బరువు తగ్గించుకునే ఉద్యోగులకు రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో నితిన్ కామత్ తెలిపారు.

రోజుకు 350 కేలరీల కొవ్వును కరిగించుకున్న ఉద్యోగులకు వివిధ రకాల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. తమ ఫిట్‌నెస్ ట్రాకర్ పరికరాల్లో ఉద్యోగులు రోజువారీగా ఎంత కొవ్వును కరిగించాల్సి ఉంటుందన్న పరిధిని ఏర్పాటు చేస్తామన్నారు. నిర్దేశిత కాలపరిమితిలో లక్ష్యాన్ని చేరుకున్న వారికి నెల రోజుల వేతనాన్ని బోనస్‌గా అందిస్తామన్నారు. అలా బరువు తగ్గిన ఉద్యోగుల మధ్య లక్కీ డ్రా నిర్వహించి రూ.10 లక్షల బహుమతిని అందిస్తామని వివరించారు.

అయితే ఉద్యోగుల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఈ కంపెనీకి కొత్తేమీ కాదట. 25 కంటే తక్కువ బీఎంఐ ఉన్న ఉద్యోగులకు ఇప్పటికే సగం నెల వేతనం బోనస్‌గా ఇస్తోంది!! వర్క్‌ ఫ్రం హోం వల్ల స్థూలకాయం తెచ్చుకుని అనారోగ్యం పాలు కావొద్దన్నదే తమ ఉద్దేశమంటున్నారు కామత్‌. కరోనా కాలంలో పెరిగిన బరువును తానెలా తగ్గించుకున్నదీ చెబుతూ ఉద్యోగులను మోటివేట్‌ చేస్తున్నారు.