Onions Thief: దేశంలో ఉల్లి దొంగలు పడ్డారు, పలు రాష్ట్రాల్లో రూ.15 లక్షలకు పైగా ఆనియన్ చోరీలు, తల పట్టుకుంటున్న పోలీసులు, కలియుగాంతం వచ్చేసిందా అంటూ సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు
Onions thief in different states of india (photo-ANI)

New Delhi,Septemer 24:  దేశంలో ఉల్లి దొంగలు పడ్డారు, అవును మీరు విన్నది నిజమే.. ఇప్పుడు దేశంలో ఎవరూ ఊహించని విధంగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా దుండుగులు బంగారం, డబ్బు, విలువైన ఫర్నీచర్, ఇంకా ఇతర రకాల వస్తువులను దొంగతనం చేశారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. దొంగలు వంటల్లో ఉపయోగించే ఉల్లిగడ్డల మీదకు తమ దృష్టిని నిలిపారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉల్లిపాయలు దొంగతనం జరిగడమే ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో అప్పుడే జోకులు కూడా పేలుతున్నాయి. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఉల్లి రేటు ఆకాశాన్ని తాకుతోంది. ప్రస్తుతం రూ.80 మీద ఉన్న ధర రానున్న రోజుల్లో 100 రూపాయల మార్క్ చేరుకుంటుదనే సంకేతాలు వస్తున్నాయి. ఈ ధరలను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

బీహర్లో కొందరు బిహారీ దొంగలు ఉల్లి దొంగతనానికి తెరలేపారు. అందుబాటులో ఉన్న ఓ ఉల్లి పాయల గిడ్డంగిపై గుట్టు చప్పుడు కాకుండా దాడికి దిగారు. ఏకంగా 328 గోనెసంచుల్లో నిల్వ ఉంచిన ఉల్లి పాయలను చోరీ చేసేశారు. దీనికోసం దొంగలు మూడు మినీ ట్రక్కులను వెంట తెచ్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బిహార్ రాజధాని పాట్నా నగర శివార్లలోని సొనారూ ప్రాంతంలో పెద్ద ఎత్తున గిడ్డంగులు ఉన్నాయి. ఉల్లి పాయల ధరలు ఆకాశానికి అంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి రైతులు పెద్ద ఎత్తున ఆ గిడ్డంగుల్లో తమ పంట ఉత్పత్తులను భద్రపరచుకున్నారు. రేటు మరింత పెరిగిన తరువాత మార్కెట్ లో అమ్ముకోవచ్చనేది వారి ఆశలపై నీళ్లు చల్లుతూ కొందరు దొంగలు చోరీకి పాల్పడ్డారు. మూడో కంటికి తెలియకుండా 328 సంచులను మాయం చేశారు. వాటి విలువ మార్కెట్ లో 16 లక్షల నుంచి 18 లక్షల రూపాయల వరకు ఉంటుందని రైతులు బావురు మంటున్నారు.

బీహర్ దొంగతనం వివరాలు

తన గిడ్డింగిలో చోరీ చోటు చేసుకున్న విషయం తెలిసిన వెంటనే యజమాని ధీరజ్ కుమార్ ఫతూహా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు కేసును ఛేదించడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.టైరు గుర్తుల ఆధారంగా దొంగలను గోనె సంచులను తరలించడానికి మినీ ట్రక్కులను వినియోగించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికంగా పండిన వాటితో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా ఉల్లిపాయలను కొనుగోలు చేసినట్లు ధీరజ్ కుమార్ తెలిపారు. మరి కొన్ని సంచులను రోజువారీ అద్దె రూపంలో రైతులు గిడ్డింగిలో దాచుకున్నట్లు చెప్పారు. అవన్నీ మాయం అయ్యాయని, ఉల్లి పాయలతో పాటు క్యాష్ కౌంటర్ లో ఉంచిన 1,83,000 రూపాయల నగదు కూడా కనిపించట్లేదని ధీరజ్ కుమార్ తన ఫిర్యాదులో నమోదు చేశారు. 328 సంచులను ఒక్క రాత్రిలో మాయం చేయడమంటే మాటలు కాదని పోలీసులు అనుమానిస్తున్నారు.

ముంబై వడాలాలోని ట్రక్ టర్మినస్ పోలీసు స్టేషన్‌లో కూడా ఇలాంటి ఫిర్యాదే నమోదైంది. ఆనంద్ నాయక్ అనే ఉల్లి వ్యాపారి తన షాపులో నిల్వ చేసిన 700 కిలోల ఉల్లి చోరీకి గురైందని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, షాపులో సీసీ టీవీ కెమెరాలున్నాయా, అని వ్యాపారిని ప్రశ్నించారు. అయితే మాది నగల దుకాణం కాదని అందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని వ్యాపారి తెలిపారు. శనివారం ఉదయం షాపు తెరిచి చూస్తే సరుకంతా మా యమైందని, 14 బస్తాల ఉల్లి దాదాపు 700 కిలోలు ఉంటుందని, విలువ రూ.50 వేల వరకు ఉంటుందని చెప్పుకొచ్చాడు. అతడి బాధంతా విన్న పోలీసులు చేసేది లేక.. ‘దొంగల కన్ను ఉల్లి షాపులపై పడింది. ఉల్లి వ్యాపారులూ.. అప్రమత్తంగా ఉండండి’ అని ఓ ఉచిత సలహా ఇచ్చి పంపించారు.

కాగా 2015 సెప్టెంబర్ నెలలో కూడా ఇలానే ఉల్లి చోరీ జరిగింది. రాజస్థాన్‌లని ఓ దుకాణంలో ఇద్దరు దొంగలు 4 వేల కిలోల ఉల్లి గడ్డలను దొంగతనం చేసారు. రంగంలొకి దిగిన పోలీసులు దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. ఉల్లికి సెక్యూరిటీగా ఉన్న వ్యక్తి, ఉల్లి పాయల వ్యాపారానికి స్థలాన్ని రెంట్ కు ఇచ్చిన మహిళ ..ఇద్దరూ కలిసి ఈ దొంగతనానికి పాల్పడ్డట్టు తేల్చారు పోలీసులు.