PM Modi at Sabarmati Ashram | Photo: ANI

Ahmedabad, March 12: వచ్చే ఏడాదికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చిరస్మరణీయంగా నిలిచిపోలాని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 'అమృత్ మహోత్సవ్' పేరుతో 75 వారాల పాటు దేశంలోని 75 ప్రాంతాల్లో ఆనాటి స్వాతంత్య్రోద్యమ స్పూర్తిని రగిలించే వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

మహాత్మాగాంధీ 'దండి మార్చ్' ప్రారంభించిన ఈరోజు (మార్చి 12) నుంచే అమృత్ మహోత్సవ్ వేడుకలు ప్రారంభం అవుతున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా సబర్మతీ ఆశ్రమం నుండి దండి వరకు నిర్వహించే పాదయాత్రకు ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. స్వాతంత్య్రోద్యమంలో చిరస్థాయిగా నిలిచిన మహాత్మా గాంధీ 'దండి మార్చ్' స్మృతులను గుర్తుచేసుకుంటూ సుమారు 280 కిలోమీటర్ల వరకు 25 రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర ఏప్రిల్ 5న ముగియనుంది. ముగింపు రోజున దండిలో భారీ బహిరంగ సభ షెడ్యూల్ చేశారు.

PM Modi flags off 'padyatra' from Ahmedabad to Dandi:

ఇక ఇటు తెలంగాణలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శుక్రవారం హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండాను ఎగరవేసి 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' వేడుకలను ప్రారంభించారు. భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే ఒక మహోజ్వల ఘట్టంగా కేసీఆర్ అభివర్ణించారు.

Amrit Mahotsav in Telangana: 

మహాత్మా గాంధీ ముందు చాలా మంది స్వేచ్ఛ కోసం పోరాడారు. కానీ మహాత్మా గాంధీ వచ్చిన తరువాతే స్వాతంత్య్ర సంగ్రామం ఉవ్వెత్తున ఎగిసింది. మహాత్ముడు చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం దేశం మొత్తాన్ని ఏకం చేసిందని కేసీఆర్ అన్నారు. భారతదేశ స్వాతంత్య్ర చరిత్ర భావి తరాలకు అందించాలని కేసీఆర్ పేర్కొన్నారు.