New Delhi, January 28: ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఆరు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో (AAP To Fight 6 State Polls) ఆమ్ ఆద్మీ పార్టీ పోటీపడనున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గురువారం జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ మేరకు ప్రకటించారు. ‘‘వచ్చే రెండు సంవత్సరాల్లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ సహా ఆరు రాష్ట్రాల్లో ఆప్ పోటీ చేస్తుంది అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఆప్ ప్రభుత్వం ఢిల్లీ ప్రజల జీవితాలను ఎలా మార్చిందో తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ‘‘ప్రజలు తమ గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాల్లో మీకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నారు. మీరు వాళ్ల దగ్గరకు వెళ్తే చాలు. ఆప్ అంటే ఏమిటో, అది ఎలా పనిచేస్తుందో వారికి తెలుసు. బీజేపీ, దాని తప్పుడు హామీలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి మీరు ప్రజల దగ్గరికి వెళ్లండి. 21 శతాబ్దంలో దేశం కోసం ఆప్ విజన్ ఏమిటో చెప్పండి..’’ అని కేజ్రీవాల్ తన పార్టీ కార్యర్తలకు పిలుపునిచ్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడి 9 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జనవరి 26వ తేదీన ఢిల్లీలో హింసకు పాల్పడిన రైతులను అరెస్టు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. 26న జరిగిన ఘటన క్షమించరానిదని, పార్టీ ఎవరైనా, నేత ఎవరైనా, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రిపబ్లిక్ డే నాడు జరిగిన రైతుల ట్రాక్టర్ల ఆందోళనలతో సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం ఆగలేదని కేజ్రీ అన్నారు. రైతులకు అందరం కలిసి మద్దతు ఇవ్వాలని, ఆ రోజు జరిగిన సంఘటన మన పోరాటాన్ని ఆపలేదన్నారు.