Hyderabad, May 5: తెలంగాణలో (Telangana) లోక్ సభ ఎన్నికల (Loksabha Elections) ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని తమదైన శైలిలో ముందుకు తీసుకుపోతున్నాయి. ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుపొందడమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah), కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. కాగజ్‌నగర్, నిజామాబాద్, హైదరాబాద్ లలో బీజేపీ పార్టీ అభ్యర్థుల తరఫున అమిత్ షా ప్రచారం చేయనుండగా.. నిర్మల్, అలంపూర్ లో రాహుల్ ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు.
అమిత్ షా షెడ్యూల్ ఇలా..
నేడు మూడు చోట్ల ఏర్పాటుచేసిన బహిరంగ సభల్లో అమిత్ షా మాట్లాడనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లోని ఎస్‌పీఎం క్రికెట్ గ్రౌండ్ లో మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4 గంటల దాకా బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. సాయంత్రం 5:10 గంటల నుంచి 5:50 గంటల వరకు నిజామాబాద్ లోని గిరిరాజ్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 6:45 గంటల నుంచి రాత్రి 7:30 గంటల దాకా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు.
రాహుల్ ప్రోగ్రాం అలా..
ఇక, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నాందేడ్ నుంచి నేరుగా నిర్మల్‌కు రానున్నారు.. అక్కడ జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు.. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా అలంపూర్ వెళ్లి అక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
కేసీఆర్ కూడా..
బీజేపీ, కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా ప్రచారంలో ముందుకు ఉరుకుతున్నది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నేడు జగిత్యాలలో పర్యటించనున్నారు. పార్టీ నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ గత నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.