YSRTP Launch: 'తెలంగాణకు చుక్క నీటి బొట్టును వదులుకోం, ఏపికి అడ్డుకోం'! తెలంగాణలో వైఎస్సార్‌టీపీని ఆవిష్కరించిన వైఎస్ షర్మిల; ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లా ఉందని నేతల ఎద్దేవా
YS Sharmila's YSRTP Political Party Launch | Photo: Twitter

Hyderabad, July 9: దివంగత వైఎస్సార్ తనయ, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సోదరి, వైఎస్ షర్మిల తెలంగాణలో తన సొంత పార్టీని స్థాపించారు. 'వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ'గా నామకరణం చేసిన తమ పార్టీ యొక్క ఆవిర్భావ సభను గురువారం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 72వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పేరును, ఎజెండాను షర్మిల అధికారికంగా ప్రకటించారు. వైఎస్సార్‌టీపీ జెండాను తల్లి వైఎస్‌ విజయమ్మతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెండాలోని అంశాలను వివరించేలా సాగిన లేజర్‌ షో ఆకట్టుకుంది.

అనంతరం, పార్టీ అధినేత వైఎస్ షర్మిల ప్రసంగిస్తూ తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యం తీసుకురావడమే తన లక్ష్యం అని ప్రకటించారు. పక్క రాష్ట్రంలో (ఏపిలో) రాజన్న రాజ్యం అమలవుతుందని ఆమె పేర్కొన్నారు.

దివంగత వైఎస్ఆర్ హయాంలో రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, పావలావడ్డీకి రుణాలు, ఆరోగ్యశ్రీ లాంటివి ప్రజలకు అందించారు. ఆయన హయాంలో లక్షల ఉద్యోగాల భర్తీ చేశారు, ప్రజలందరినీ సమానంగా చూశారు, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు అని చెప్పుకొచ్చారు. ఇక నేడు కేసీఆర్ హయాంలో తెలంగాణలో అందరూ అప్పుల పాలయ్యారని వైఎస్ షర్మిల విమర్శించారు. సంక్షేమంలో తాము నెంబర్ 1 అని చెప్పుకునే కేసీఆర్ కరోనాతో అప్పుల పాలైన పేదలకు ఏం సమాధానం చెప్తారు, ఆరేళ్లలో 6 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అందుకు ఏం జవాబిస్తారని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తామనే హామీని మరిచిపోయి, తమ కుటుంబానికే నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. రాష్ట్రం ఏర్పడ్డాక 4 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు.

కృష్ణా జలాల వివాదంపై ప్రస్తావన

 

ఇటీవల కాలంగా కృష్ణా జలాల వాటా విషయంలో టీఎస్- ఏపిల మధ్య ముదురుతున్న వివాదం గురించి వైఎస్ షర్మిల తన ప్రసంగంలో ప్రస్తావించారు. కృష్ణా నదిపై రెండేళ్ల నుంచి ప్రాజెక్టులు కడుతుంటే సీఎం కేసీఆర్‌ ఇప్పుడే నిద్రలేచారా? "కేసీఆర్ ఏపి సీఎం జగన్‌ను తమ ఇంటికి భోజనాలకు పిలవచ్చు, స్వీట్లు పంచుకోవచ్చు, తమ ఉమ్మడి శత్రువును ఓడించుకోవచ్చు, అదే నీటి పంచాయితీపై రెండు నిమిషాలు ఇద్దరూ కలిసి మాట్లాడుకోలేరా"? అంటూ కేసీఆర్ ను షర్మిలా ప్రశ్నించారు.

తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీటి బొట్టును వదులుకోం, అలాగే పక్క రాష్ట్రానికి చెందాల్సిన ఒక్క నీటిబొట్టును అడ్డుకోం

అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించింది.

ఇక, తెలంగాణలో ఇంకా కాంగ్రెస్‌ నిలబడి ఉందంటే దానికి కారణం వైఎస్సారే అని పేర్కొంది, అలాంటి వైఎస్సార్‌ను టీఆర్‌ఎస్‌ నాయకులు దూషిస్తుంటే కాంగ్రెస్‌ నేతలు చేతులు ముడుచుకుని చేతగాని వాళ్లలా కూర్చున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిపై ఆధారాలున్నాయంటున్న బీజేపీ అధ్యక్షుడు, ఎందుకు బయటపెట్టడం లేదు? కేసులెందుకు పెట్టడం లేదు? ఇద్దరికీ మధ్య ఏదైనా డీల్ కుదిరిందా? టీఆర్‌ఎస్, బీజేపీ తోడు దొంగలే అని షర్మిల విమర్శించారు.

కాగా, షర్మిల పార్టీ ఆవిర్భావ సభలో తమ పార్టీ సిద్ధాంతాలు, భావజాలం ఏంటో తెలపకుండా ఆమె ప్రసంగం ఆసాంతం ఇతర పార్టీ నేతలపై విమర్శలు, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే ఉందని విమర్శలు వస్తున్నాయి. వైఎస్ఆర్టీపీ పార్టీ పేరు, పార్టీ జెండా రెండూ వైఎస్ఆర్సీపీకి స్పూఫ్‌లా ఉన్నాయని అంటున్నారు. ఆమె చదివిన స్క్రిప్ట్ పేలవంగా ఉంది. ఆ కార్యక్రమం మొత్తం ఏదో సినిమా ఆడియో ఫంక్షన్‌లా ఉందని బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు.