AP Sand Crisis Politics TDP chief Chandrababu Naidu to hold day-long fast over sand crisis (Photo-ANI)

Amaravathi, November 14: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఇసుక (AP Sand Crisis Politics) చుట్టూ తిరుగుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వం ఇసుక వారోత్సవాలకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంటే మరో వైపు ఇసుక కొరతకు నిరసనగా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు (TDP chief Chandrababu) దీక్షకు దిగారు. టీడీపీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ వద్ద 12గంటల నిరసన దీక్షకు దిగారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది.

ఏపీలో ఇసుక కొరతను తీర్చడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు రూ.25లక్షలు నష్ట పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌తో ఆయన దీక్ష చేస్తున్నారు.అలాగే ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10వేల చొప్పున భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్షకు జనసేన,బీజేపీ, వామపక్ష పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి.

ఇసుక కొరతకు నిరసనగా చంద్రబాబు దీక్ష

అటు వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారథి కూడా దీక్ష చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. తనపై ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు చేసిన నేపథ్యంలో దాన్ని నిరసిస్తూ ధర్నా చౌక్ వద్ద ధర్నాకు దిగుతానని చెప్పారు. చంద్రబాబు దగుల్బాజీ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆయన దీక్షా శిబిరం పక్కనే తానూ దీక్ష చేస్తానని చెప్పారు. మరోవైపు మంత్రులు చంద్రబాబు దీక్షపై మండిపడుతున్నారు.

అక్టోబర్ లో చెయ్యాల్సిన దీక్ష ఇప్పుడు చేస్తే లాభం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కావలసినంత ఇసుక దొరుకుతుంటే దీక్ష ఎందుకని ఎద్దేవా చేశారు. ఇసుకను అడ్డం పెట్టుకుని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister for Panchayat Raj Peddireddy Ramachandra Reddy) విమర్శించారు. టీడీపీ హయాంలో వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపించారు.

ఇసుకపై చంద్రబాబు రాజకీయాలను నిరసిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి విజయవాడ బందరురోడ్డులో తన క్యాంపు ఆఫీసు సమీపంలో గురువారం ధర్నాకు దిగారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇసుక మాఫియాతో దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబుకు అసలు ఇసుక గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న అధికారులపై టీడీపీ నేతలు దాడి చేసిన విషయాన్ని మంత్రి రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

‘చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు వస్తుంది. అయితే వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి (Chief Minister Y S Jagan Mohan Reddy) అధికారంలోకి రాగానే వర్షాలు పడ్డాయి. వరదల కారణంగా ఇసుక తీయడం కష్టమైంది. దీంతో చంద్రబాబు ఇసుకపై తప్పుడు రాజకీయాలు చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.

నేటి నుంచి ఇసుక వారోత్సవాలు

చంద్రబాబుది దొంగ దీక్ష అని ఆయనను ప్రజలు ఎవ్వరు నమ్మడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP ) ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ (MLA vasantha krishna prasad)అన్నారు. చంద్రబాబు హయాంలో వేల కోట్ల రూపాయల ఇసుక కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అలాంటిది ఆయన దీక్ష చేయడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ‘చంద్రబాబు వేసిన చార్జిషీటు పరమ బోగస్. ఇసుక దోపిడిలో చంద్రబాబుకు ఎన్జీటీ వంద కోట్ల జరిమానా వేసింది. ఇలా దొంగ దీక్షలు చేస్తే వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.

నేటి నుండి ఇసుక వారోత్సవాలు నిర్వహించనున్న ఏపీ ప్రభుత్వం

ఇదే సమయంలో ఏపీ లో ఇసుక కొరత ని సీరియస్ గా తీసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇసుక కొరతను నివారించటం కోసం నేటి నుండి ఇసుక వారోత్సవాలు (Sand Celebrations) నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 14 నుండి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించి ప్రజలకు ఇసుక అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీరే వరకు అధికారులు సెలవులు కూడా తీసుకోవద్దని ఆయన తెలిపారు.

వరదల వలన ఇసుక ఇబ్బంది ఏర్పడిందని, అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న ఇసుక కొరత నివారించడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు రంగంలోకి దిగుతారని తెలిపారు. వారం రోజులపాటు పూర్తిగా ఈ అంశంపైనే దృష్టి పెట్టి అడిగిన వారికి అడిగినంత ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేసినా, నిర్ణయించిన దానికంటే అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.