Rajasthan Chief Minister Ashok Gehlot with former deputy chief minister Sachin Pilot in Jaipur (Photo-PTI

Jaipur, August 14: అనుకోని పరిణామాలు..భారీ ట్విస్టుల మధ్య సాగిన రాజస్థాన్ పొలిటికల్ ఎపిసోడ్ కు (Rajasthan Political Crisis) శుభం కార్డు పడింది. రాజస్తాన్‌ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో (confidence motion) విజయం సాధించింది. అంతర్గత విభేదాలను పరిష్కరించుకుని అసెంబ్లీలో అడుగుపెట్టిన అశోక్ గెహ్లాట్ సర్కారు ఎట్టకేలకు విశ్వాస పరీక్షలో విజయం సాధించింది.

బీజేపీ పెట్టాలనుకున్న అవిశ్వాస తీర్మానాన్ని పాలక కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో మూజువాణి ఓటుతో గెహ్లాట్ సర్కార్‌ (Ashok Gehlot Govt) నెగ్గింది. విశ్వాస పరీక్షపై ఓటింగ్‌ అనంతరం సభను ఈనెల 21 వరకూ వాయిదా వేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషీ ప్రకటించారు.

తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ పార్టీ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంకలతో భేటీ అనంతరం తిరిగి పార్టీ గూటికి చేరడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని సులభంగా నెగ్గింది. తాను కాంగ్రెస్‌ తరపున పోరాడే శక్తివంతమైన యోధుడనని పేర్కొన్న సచిన్‌ పైలట్‌ ఎలాంటి విపత్కర పరిస్ధితుల్లోనూ పార్టీని కాపాడుకుంటానని చెప్పారు. తమ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గడం సంతోషంగా ఉందన్నారు. ఊహాగానాలకు స్వస్తి పలికినట్లయిందని తెలిపారు. రాజస్థాన్ ప్రజల ప్రయోజనాల కోసం అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు.

విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్‌ మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాల్లో ధనం, అధికార బలం ప్రయోగించి ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసిందని ఆరోపించారు.  అశోక్ గెహ్లాట్‌కు షాకిచ్చిన బీఎస్‌పీ, సీఎం గెహ్లాట్‌తో భేటీ అయిన సచిన్‌ పైలట్‌

రాజస్తాన్‌లోనూ అదే ప్రయత్నం చేసిన బీజేపీ పార్టీ భంగపడిందని అన్నారు. ఇక 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్‌ అసెంబ్లీలో గెహ్లాట్ సర్కార్‌కు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, బీజేపీ సంఖ్యాబలం 72గా ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు ముందు అశోక్‌ గెహ్లాట్ మాట్లాడుతూ ఈరోజు అసెంబ్లీ భేటీ వాస్తవాలకు అద్దం పడుతుందని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఐక్యతకు సంకేతంగా నిలుస్తుందని..సత్యమేవ జయతే అంటూ ట్వీట్‌ చేశారు.

అంతకు ముందు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ కోవిడ్ కల్లోలంలో కూడా ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రతిపక్షం ప్రయత్నాలు  చేయడం ఆపలేదన్నారు. ప్రభుత్వాలు వస్తాయి? పోతాయి కానీ.. ఇందిరా గాంధీ సైతం ఓటమిపాలైనా తర్వాత సంతోషంగానే ఉన్నారని అన్నారు. గత 50ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ఇటువంటి విచిత్రమై పరిస్థితి ఎప్పుడూ ఎదురవ్వలేదన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రతిపక్ష బీజేపీ చేసిన ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరబోవని ఉద్ఘాటించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పదవి సేఫ్, వెనక్కి తగ్గిన సచిన్ పైలట్, సీఎం‌పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వివరణ, సొంతగూటికి కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

రాజస్థాన్‌లో ఐదేళ్లూ పాలిస్తామని, ప్రభుత్వాన్ని ఎప్పటికీ కూలిపోనివ్వనని వ్యాఖ్యానించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపుర్‌లో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసిందని  విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. అంతేకాదు, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడే సంప్రదాయం రాజస్థాన్‌లో లేదని పేర్కొన్నారు. దేశంలో ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలను దుర్వినియోగం చేయడంలేదా? అని కేంద్రంలోని బీజేపీని నిలదీశారు.