Mumbai, NOV 23: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో (Assembly Elections) పాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలకు, నాందేడ్, వయనాడ్ (Wayanad) లోక్ సభ స్థానాల (ఉపఎన్నికల) ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మహారాష్ట్రలో అసెంబ్లీ పోరు హోరాహోరీగా (Counting in Maharashtra)సాగగా.. సీఎం ఎవరు కానున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలతోపాటు నాందేడ్ లోక్ సభకు ఇటీవల ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 61.1శాతం పోలింగ్ నమోదు కాగా.. తాజా ఎన్నికల్లో 66.05శాతం పోలింగ్ నమోదైంది. ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం మూడు దశాబ్దాల్లో ఇదే తొలిసారి కావడం విశేషం. ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ( Counting) ప్రారంభం కాగా, 9 గంటల నుంచి ఫలితాల సరళి తెలిసే అవకాశం ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున 288 మంది అబ్జర్వర్లతో పర్యవేక్షణ కొనసాగనుంది. నాందేడ్ లోక్ సభ లెక్కింపును ప్రత్యేకంగా ఇద్దరు అబ్జర్వర్లు పర్యవేక్షించనున్నారు.
జార్ఖండ్ లో అలా..
ఇక, జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా.. తొలిసారిగా 67.74శాతం పోలింగ్ నమోదయ్యింది. నవంబర్ 15, 2000లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈస్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక్కడ నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. అధికార జేఎంఎం (JMM) మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా, విపక్ష ఎన్డీయే కూడా తమదే విజయం ఖాయమని చెబుతోంది. ఇటీవల వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ జార్ఖండ్ లో ఎన్డీయేవైపు (NDA) మొగ్గు చూపాయి. ఈ రెండు రాష్ట్రాలతోపాటు కేరళలోని వయనాడ్ లోక్‌సభ సహా 13 రాష్ట్రాల్లో 46 అసెంబ్లీ స్థానాల (ఉప ఎన్నికల) ఓట్ల లెక్కింపు కూడా శనివారం జరగనుంది.