Guyana, NOV 21: గయానా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ (Pm Modi).. అక్కడి పార్లమెంటులో ప్రసంగించారు (Guyana Parliament). భారత్- గయానాల మధ్య బలమైన బంధముందన్న ఆయన.. రెండు దేశాలూ ఒకే విధమైన ప్రజాస్వామ్య విలువలను పంచుకుంటాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ ఇది యుద్ధాల శకం కాదని ఉద్ఘాటించారు. ఇది ఘర్షణలకు సమయం కాదని, సంఘర్షణలను సృష్టించే వారిని గుర్తించే సమయమన్నారు. బుధవారం ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో (Irfan Ali) సమావేశమైన మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
రెండు దేశాల మధ్య 10 రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. హైడ్రో కార్బన్స్, డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలు, రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఫార్మా, వ్యవసాయం వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. భారత ప్రధాని గయానాలో పర్యటించడం 56ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.