Opposition Leaders (Photo Credits: Twitter/@KCVenugopal)

Bengaluru, July 18: 2024లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో మోదీ సర్కారుని ఎదుర్కోవడానికి 26 ప్రతిపక్ష పార్టీలు ఏకమై పోరాడడానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా రెండో రోజు సమావేశం జరుపుతున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఒకే వేదికపైకి వచ్చిన ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ‘ఇండియా’ అనే పేరును ఖరారు చేశాయి. భారత జాతీయ ప్రజాస్వామ్య సమష్టి కూటమిగా నిర్ణయించాయి. ఈ పేరుపై నేతలంతా సుముఖత, ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిని అధికారికంగా ప్రకటించవలసి ఉంది.

కూటమికి ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్‌ (ఐఎన్‌డిఐఏ)పేరును సూచించిన నేపథ్యంలో..అలయెన్స్ (కూటమి) అనే పదంపై పునరాలోచన జరపాలని వామపక్ష పార్టీలు కోరినట్లు సమాచారం. కాగా ప్రతిపక్ష పార్టీల డిన్నర్‌ మీటింగ్ నిన్న బెంగళూరులో జరిగింది. సాంఘీక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే అజెండాగా పనిచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఒకే భావాజాలం కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే ధ్యేయం కోసం పోరాడతామని అన్నారు. డిన్నర్ మీటింగ్ అనంతరం ఈ మేరకు మీడియాకు తెలిపారు.

మోదీ సర్కారు ఓటమే లక్ష్యంగా ప్రారంభమైన 26 పార్టీల ప్రతిపక్షాల సమావేశం, హాజరైన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

ప్రధాన మంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని చెప్పారు. భారత దేశ ఆత్మ, రాజ్యాంగం, లౌకికవాదం, సాంఘిక న్యాయం, ప్రజాస్వామ్యాలను పరిరక్షించడంపై మాత్రమే తమ పార్టీకి మక్కువ ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో తమ మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. అవి అధిగమించలేనంత పెద్ద విభేదాలు కావని, ప్రజలను కాపాడటం కోసం వాటిని పక్కన పెట్టవచ్చునని చెప్పారు. ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నారన్నారు. నిరుద్యోగంతో బాధ పడుతున్న యువత కోసం, హక్కుల అణచివేతకు గురవుతున్న పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీల కోసం వాటిని వదిలిపెట్టవచ్చునని చెప్పారు.

విపక్షాలకు ఝలక్ ఇచ్చిన మోదీ, NDAలో చేరిన లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్..

ఈ ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, జేడీయూ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్‌డీ, అప్నాదళ్ (కే), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, ఆర్ఎస్‌పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎండీఎంకే, వీసీకే, కేఎండీకే, ఎంఎంకే, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (ఎం), కేరళ కాంగ్రెస్ (జోసఫ్) పార్టీలు పాల్గొన్నాయి.

ఇదిలా ఉంటే ప్రతిపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. బెంగళూరులో సమావేశమైన పార్టీలకు ఒకే ఒక మంత్రం ఉందని, అది.. కుటుంబం యొక్క, కుటుంబం ద్వారా, కుటుంబం కోసం అని వివరించారు. ఇది స్వచ్ఛమైన అవినీతి కూటమి అని ఆరోపించారు. అందుకే ప్రజలు 2024లో మళ్లీ ఎన్డీయేను అధికారంలోకి తేవాలని నిర్ణయించుకున్నారన్నారు.