Patna, August 24: తీవ్ర ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీలో బుధవారం జరిగిన బలపరీక్షలో (Bihar Assembly Floor Test) నితీష్ కుమార్ ప్రభుత్వం నెగ్గింది.విశ్వాస పరీక్షలో నితీష్ సారథ్యంలోని మహాఘట్ బంధన్ సర్కార్‌కు 160 ఓట్లు (New Mahagathbandhan Govt Wins Trust Vote) వచ్చాయి. విశ్వాస పరీక్ష వేళ బీహార్ అసెంబ్లీలో బీజేపీ విధానాలను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విమర్శించారు.
బీజేపీ హిందూ-ముస్లింల అంశం తీసుకొస్తోందని, ఇది సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. 2024లో బీజేపీయేతర పార్టీలన్నింటినీ కలుపుకుని విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలన్నీ కలిసివచ్చి మద్దతిచ్చినందుకు నితీశ్ ధన్యవాదాలు తెలిపారు. విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా నితీశ్ చేసిన ప్రసంగంపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. ఓటింగ్‌కు ముందే అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా అసెంబ్లీలో సీఎం నితీష్ మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీలో మంచి వాళ్లకు చోటు లేదని వ్యాఖ్యానించారు.
2015లో బీజేపీని తానే గెలిపించానని అన్నారు. 2024లో బీజేపీకి తానేంటో నిరూపిస్తానని చాలెంజ్ చేశారు. వాజ్‌పేయి, అద్వానీలే తన మాట వినేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు బీజేపీలో లేవన్నారు. 2017లో తేజస్వీ యాదవ్‌పై విమర్శలు చేశారని, ఇప్పటి వరకు ఎందుకు నిరూపించలేదని ప్రశ్నించారు. పాట్నా యూనివర్సిటీ కేంద్ర హోదా కల్పించాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. సమాజంలో అలజడి సృష్టించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం, డబ్బు ఆశ చూపి వారిని కొనుగోలు చేయడం బీజేపీ ఫార్ములా అని డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ధ్వజమెత్తారు. ఆర్జేడీ-జేడీయూ కొత్త భాగస్వామ్యం చారిత్రాత్మకమని అన్నారు. తమ భాగస్వామ్యం సుదీర్ఘ కాలం నిలవనుందని, దీనిని ఎవరూ పడగొట్టలేరని ధీమా వ్యక్తం చేశారు.
2024లో బీజేపీ గెలుపుపై సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు, ప్రధానిగా తాను రేసులో ఉండనని వెల్లడి
కాగా గత కొంతకాలంగా బీజేపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఈ నెల ప్రారంభంలో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం బిహార్ సీఎం పదవికి రాజీనామా చేసి ప్రతిపక్ష ఆర్జేడీతో జట్టుకట్టి (Bihar Mahagathbandhan) ఆగస్టు 10న ఎనిమిదోసారి బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.నితీశ్ సీఎంగా, తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా మొత్తం 31 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆర్జేడీకి 16, జేడీయూకు 11 మంత్రిపదవులు దక్కాయి.
ఇక విశ్వాస పరీక్షలో సమయంలో మాట్లాడిన బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ సీబీఐ, ఈడీ, ఐటీలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. బీజేపీ నేతలు పిరికిపందలని అందుకే సీబీఐ, ఈడీ, ఐటీలను ఉసిగొల్పుతున్నారని ఆయన ఆరోపించారు. ఇక తనను బద్నాం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నాలు ముమ్మరం చేస్తుందని ఆయన చెప్పారు.