Bihar Political Crisis: బీహార్‌లో రాజకీయ సంక్షోభం, జేడీయూ-బీజేపీ మధ్య బ్రేకప్,రాజీనామా బాటలో 16 మంది బీజేపీ మంత్రులు, నేడు గవర్నర్‌తో  సీఎం నితీష్ కుమార్ భేటీ
Nitish Kumar with Narendra Modi (Photo Credits: PTI)

Patna, August 9: మహారాష్ట్ర సంక్షోభం తరువాత బీహార్‌లో రాజకీయ సంక్షోభం (Bihar political crisis) నెలకొంది.రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా జేడీయూ, బీజేపీ మ‌ధ్య తెగదెంపులు దాదాపు ఖరారు అయినట్లుగా ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి. సీఎం నితీశ్ కుమార్ (CM Nitish Kumar) మ‌రికాసేప‌ట్లో గ‌వ‌ర్న‌ర్ ఫాగు చౌహాన్‌ను క‌ల‌వ‌నున్నారు. ఈ మేరకు గవర్నర్ అపాయింట్ మెంట్ (seeks appointment from Governor Chauhan) కోరినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఓ భారీ న్యూస్‌ను పేల్చ‌నున్న‌ట్లు ఆ పార్టీ నేత ఇవాళ ప్ర‌క‌టించారు.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఎన్డీఏ ప్ర‌భుత్వంలో ఉన్న 16 మంది బీజేపీ మంత్రులు నేడు రాజీనామా చేయ‌నున్నారు. బీజేపీ మంత్రులు కూడా గ‌వ‌ర్న‌ర్ ఫాగూ చౌహాన్‌తో భేటీ కానున్నారు. బీజేపీ నేత‌లంద‌రూ ఇవాళ ఉద‌యం డిప్యూటీ సీఎం త‌ర్కిషోర్ ప్ర‌సాద్‌ను క‌లిశారు. అయితే నితీశ్ ఏదైనా ప్ర‌క‌టించిన త‌ర్వాతే తాము రాజీనామా నిర్ణ‌యంపై ఆలోచిస్తామ‌ని ఓ బీజేపీ నేత తెలిపారు.

మహారాష్ట్ర మంత్రులుగా 18 మంది ప్రమాణ స్వీకారం, శివసేన నుంచి 9 మంది, బీజేపీ నుంచి 9 మంది ప్రమాణం

మరోవైపు మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇంట్లో ఆర్జేడీ ఎమ్మెల్యేలు, ఎంపీలు భేటీ అయ్యారు. లూలూ తనయుడు తేజస్వీ యాదవ్‌ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతేగాక వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సైతం లాలూ ఇంటికి వెళ్లారు. మరోపక్క ఇదే విషయమై బిహార్‌కు చెందిన బీజేపీ నేతలు డిప్యూటీ సీఎం తార్కిషోర్ ప్రసాద్ నివాసంలో సమావేశమయ్యారు.

ఇదిలా ఉంటే సీఎం పదవికి నితీష్‌ కుమార్‌ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12.30 గంటలకు గవర్నర్‌ను కలిసి తన రాజీనామా సమర్పించనున్నట్లు సమాచారం. మరోవైపు బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్‌తో సమావేశానికి బీజేపీ కూడా సమయం కోరింది. ఆర్జేడీ-కాంగ్రెస్‌తో కలిసి నితీష్‌ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నితీష్‌ కుమార్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమని కాంగ్రెస్‌ ప్రకటించింది. అదే విధంగా బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే, నితీష్‌ను అక్కున చేర్చుకునేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం ఆర్జేడీ తెలిపింది.

బీహార్‌ ముఖ్యమంత్రి పీఠంపై తనని కూర్చోబెట్టినప్పటికీ అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఎక్కువ ఉండడంతో కాషాయం తమపై ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తోందని సీఎం నితీశ్‌ కుమార్‌ చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం నడపడానికి ఆయనకి ఎప్పుడూ తగినంత స్వేచ్ఛ ఇవ్వకపోగా, తనకున్న జనాదరణను బీజేపీ బలపడడానికి వినియోగించుకుంటోందనే వార్తలు వినినిస్తున్నాయి. 2025 సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే సొంత పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిని చెయ్యాలని భావిస్తూ దానికి అనుగుణంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇదిలా ఉంటే బీజేపీ నాయకత్వం తీరుపై తన అసంతృప్తిని నితీశ్‌ కుమార్‌ ఎక్కడా దాచుకోవడం లేదు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రధాని మోదీ కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో నితీశ్‌ పాలుపంచుకోలేదు. ఆదివారం మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ భేటీకి గైర్హాజరయ్యారు. జూలై 17న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానికి దూరంగా ఉండిపోయారు.రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వీడ్కోలు పలుకుతూ జూలై 22న ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు సైతం హాజరుకాలేదు. మూడు రోజుల తర్వాత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవంలోనూ పాల్గొనలేదు.వీటితో పాటు కులాల వారీగా జనగణన, జనాభా నియంత్రణ, అగ్నిపథ్‌ పథకం వంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో విభేదించారు.