
Hyderabad, December 3: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) , జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తిరుపతిలో నిర్వహించిన ఒక సమావేశంలో భాగంగా 'మతాల మధ్య గొడవలు పెట్టేది హిందూ నాయకులే, సెక్యులరిజాన్ని ఇబ్బంది పెట్టింది కేవలం హిందువులే' అంటూ వివాదాస్పద వ్యాఖలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో తనకన్నా అర్థమవుతుందా? అని రాజా సింగ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఒక హిందువా? లేక వేరే మతంలోకి ఏమైనా కన్వర్ట్ అయ్యారా? వెల్లడించాలని నిలదీశారు. హిందూ ధర్మం (Hinduism) గురించి పవన్ కళ్యాణ్ కు కనీస అవగాహన ఉందా? హిందూలపై మీకంత కోపం ఎందుకు? మీరు పెట్టుకున్న చిల్లర పార్టీ జనసేనలో ఎవరూ హిందువులు లేరా? అని రాజా సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సెక్యులరిజం (Secularism) గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, ఆయనకు సెక్యులరిజం అంటే తెలుసా అని ప్రశ్నించారు. మరో ఐదేళ్ల వరకు ఎన్నికలు అయితే ఏమి లేవు, ఇప్పుడు మీకు సీఎంగా జగన్ ఉన్నారు. మీకు బాగా ఇస్తారు ఆయన అని రాజా సింగ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యం ఏమిటి? ఆయనకు ఆయన భాషలోనే జవాబు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, ఖబడ్దార్ పవన్ కళ్యాణ్ అంటూ రాజా సింగ్ హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ ఏమన్నారు?
సోమవారం తిరుపతిలో జనసైనికులతో నిర్వహించిన ఒక సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హిందువులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ప్రజలను మతాల పేరుతో విభజించి గొడవలను ప్రోత్సహించేది కేవలం హిందూ నాయకులే తప్ప, మిగతా వారు కాదంటూ జనసేన చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మతాల మధ్య గొడవలు పెట్టేది హిందూ నాయకులే తప్ప మిగతా మతాల వారు కాదు, వాళ్లకసలు ఆ ఆలోచనే రాదంటూ పవన్ వ్యాఖ్యలు చేశారు. విదేశాలకు వెళ్లినా, గల్ఫ్ లకు వెళ్లినా మన దేశం బాగుంటుందని ముస్లింలే చెప్తారు కానీ, హిందువులు కాదని పవన్ అన్నారు. తాను చిన్నప్పట్నించీ వింటుంది, సెక్యులరిజాన్ని ఇబ్బంది పెడుతుంది హిందువులే అని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం తిరుమలలో అన్యమత ప్రచారం చేసేది కూడా హిందూనేతలే అని పవన్ ఆరోపించారు. ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోతే 151 సీట్లు ఎందుకు? రేప్ ఘటనలపై పవన్ కళ్యాణ్ స్పందన
కాగా, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఆయన మాట్లాడిన వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రాజా సింగ్ కూడా స్పందించారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ రేప్ ఘటనలపై ఆయన చేసిన కమెంట్స్ కూడా ట్రోల్ అయ్యాయి.