New Delhi, August 24: దేశ రాజధానిలో బీజేపీ-ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య వార్ మరింతగా వేడెక్కింది. ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంపై మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించిన తర్వాత రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు నేతలు. ఈ క్రమంలోనే ఐదుగురు ఆప్ సీనియర్ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
బీజేపీ పార్టీ డబ్బులు, బెదిరింపులతో తమ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకునేందుకు (JP Offered Rs 20 Crore Each To 4 AAP MLAs) ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు.ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్ర ఏజెన్సీలను ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏవిధంగా ఉపయోగిస్తుందో ప్రస్తుత పరిస్థితులు అద్దపడుతున్నాయని ఆప్ జాతీయ ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ (Alleges MP Sanjay Singh)పేర్కొన్నారు.
మా పార్టీలోకి రండి.. వచ్చి రూ.20 కోట్లు తీసుకోండి.. లేదా సిసోడియా మాదిరిగా సీబీఐ కేసులు ఎదుర్కోండి అని ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు బెదిరించారు. ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమ్‌నాథ్ భారతి, కుల్దీప్‌లకు బీజేపీ నేతలు ఈ ఆఫర్ ఇచ్చారు. పార్టీ మారితే ప్రతిఒక్కరికి రూ.20 కోట్లు ఇస్తామన్నారు. ఇతర ఎమ్మెల్యేలను తనతో తీసుకొస్తే రూ.25 కోట్లు ఆఫర్ చేశారు.’ అని ఎంపీ సంజయ్ సింగ్ పేర్కొన్నారు
తమకు బీజేపీ నేతలు ఏవిధంగా ఆఫర్ ఇచ్చారనే అంశాన్ని మిగిలిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలు విలేకరులతో చెప్పారు. ‘సిసోడియాపై పెట్టిన కేసులు ఫేక్ అని తమకు తెలుసునని, కానీ, ఆప్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సీనియర్ నేతలు నిర్ణయించారని బీజేపీ నేతలు మాతో చెప్పారు. ఆప్ నాయకులను తీసుకువచ్చే పనిని వారికి అప్పగించినట్లు తెలిపారు. ఎంత దూరమైనా వెళ్లి ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొడతామని వారు వెల్లడించారని ఎమ్మెల్యే సోమ్‌నాథ్ పేర్కొన్నారు. మరోవైపు.. ఆప్ ఎమ్మెల్యేలు, సిసోడియా.. ఆపరేషన్ లోటస్‌ను ఆపరేషన్ బోగస్‌గా మార్చారని సంజయ్ సింగ్ ఎద్దేవా చేశారు.
2024లో బీజేపీ గెలుపుపై సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు, ప్రధానిగా తాను రేసులో ఉండనని వెల్లడి
బీజేపీలో చేరితే రూ 20 కోట్లు ఇస్తామని నలుగురు ఆప్ ఎమ్మెల్యేలకు కాషాయ పార్టీ ఆఫర్ చేసిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించిన క్రమంలో సిసోడియా స్పందించారు.బీజేపీ ప్రలోభాలకు లొంగి ఆప్ ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేయరని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కాషాయ పార్టీని హెచ్చరించారు.తనను ఆప్ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు విఫలయత్నం చేసిన బీజేపీ ఆపై తమ ఎమ్మెల్యేలకు రూ 20 కోట్లు ఆఫర్ చేసిందని, ఈడీ, సీబీఐలతో బెదిరింపులకు దిగుతోందని ఆరోపించారు. ఆప్‌ను చీల్చేందుకు బీజేపీ తాజా కుట్రకు తెరలేపిందని అన్నారు. బీజేపీ ఇలాంటి పనులకు దూరంగా ఉంటే మంచిదని మనీష్ సిసోడియా హితవు పలికారు.
తాము అరవింద్ కేజ్రీవాల్ మనుషులమని, భగత్ సింగ్ బాటలో నడిచేవారమని స్పష్టం చేశారు. తాము ప్రాణాలైనా వదులుతాము కానీ పార్టీకి ద్రోహం చేయబోమని పేర్కొన్నారు. తమ ముందు ఈడీ, సీబీఐ తోకముడవాల్సిందేనని వ్యాఖ్యానించారు.