
Mumbai, April 8: శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ (Bharatiya Janata Party) దేశ ఆర్థిక రాజధాని ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు కొందరు కేంద్ర హోంశాఖకు ఓ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోందన్నారు. బీజేపీ నేతలు మాజీ ఎంపీ కిరీట్ సోమయ్యతో సహా పలువురు నేతలు, బిల్డర్స్, వ్యాపారవేత్తలతో కూడిన ఓ బృందం ఈ కుట్ర వెనుక ఉన్నాయని రౌత్ (Shiv Sena Leader Sanjay Raut) సంచలన ఆరోపణలు చేశారు.
ముంబైని కేంద్ర పాలిత ప్రాంతంగా (Mumbai a Union Territory) ప్రకటించే విషయంలో కొన్ని సమావేశాలు కూడా జరిగాయని, నిధుల సమీకరణ కూడా జరుగుతోందని అన్నారు. ఇలా.. ఓ రెండు నెలలుగా కొందరు ఇదే పనిలో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. వీటికి సంబంధించిన పక్కా ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌కు కూడా దీనికి సంబంధించిన సమాచారం అందిందని ఆయన వెల్లడించారు.
ముంబైలో మరాఠీ ప్రజల శాతం తగ్గిందని, ఇదే విషయంపై బీజేపీ నేతలు కోర్టుకు వెళ్లి చెప్పడానికి రెడీ అవుతున్నారని, ఈ కారణంగానే ముంబైని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని వాళ్లు డిమాండ్ చేస్తారని రౌత్ ఆరోపించారు.