Bihar Minister Narayan Prasad: పెట్రోలు ధరలు పెరిగితే మంచిదే, పైగా జనాలు అలవాటు పడతారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ బీజేపీ మంత్రి నారాయణ్ ప్రసాద్, మండిపడుతున్న ప్రతిపక్షాలు
Representational Image | (Photo Credits: PTI)

Patna, Feb 20: దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సామాన్యుడి జేబులు గుల్ల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్‌ బీజేపీ మంత్రి నారాయణ ప్రసాద్ (Bihar Minister Narayan Prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బీహార్ పర్యాటకశాఖ మంత్రి నారాయణ్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ధరల పెరుగుదలకు జనం అలవాటు పడిపోయారు. ధరల పెరుగుదల వలన జనానికి ఇబ్బందేమీ లేదని వ్యాఖ్యానించారు.

ధరల పెరుగుదల (fuel prices) అంశంపై అసెంబ్లీ పరిసరాల్లో విపక్షాలు నిరసన ప్రదర్శనలు చేస్తూ, ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపధ్యంలో మంత్రి నారాణయ్ ప్రసాద్ విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ మీడియా ముందు..ధరల పెరుగుదల వలన ఎటువంటి ప్రభావం ఉండబోదని, దీని వలన జనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. వారికి ధరల పెరుగుదల అలవాటైపోయిందని పేర్కొన్నారు. ధరలు పెరిగితే జనం సొంతవాహనాలకు బదులుగా (Common People Don't Drive Cars) బస్సులపై వెళతారన్నారు. బడ్జెట్ వచ్చిందంటే ధరలు పెరుగుతుంటాయి. దీని ప్రభావం ఎమీ ఉండదు. జనం మెల్లమెల్లగా అలవాటు పడిపోతారని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం రాజకీయ నాయకులు తప్ప సామాన్యులు కార్లు వాడకపోవడం ఉత్తమం’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నారాయణ్‌ ప్రసాద్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వేడి రగిల్చాయి. ప్రతిపక్షాలు ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ (Rashtriya Janata Dal (RJD) MLA Mukesh Raushan) పెట్రో ధరల పెంపుకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీకి సైకిల్‌ మీద వచ్చిన సంగతి తెలిసిందే.

బీజేపీకి ఘోర పరాభవం, పంజాబ్‌లో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ పార్టీ, మొత్తం ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థానాలు కైవసం, భారీ స్థాయిలో 71.39 పోలింగ్ నమోదు

పెట్రో ధరల పెంపు పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుండటంతో ఉత్పత్తి కోతలను తగ్గించాలని పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎగుమతి దేశాల (ఒపెక్), అనుబంధ చమురు ఉత్పత్తిదారులను కోరారు. అంతకుముందు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న ప్రధాన్, కరోనావైరస్ మహమ్మారి కారణంగా చమురు ఉత్పత్తి చేసే దేశాలలో ఇంధన ఉత్పత్తి తగ్గిందని.. అందువల్లే ధరల పెరిగాయని ఆరోపించారు. తక్కువ ఉత్పత్తి డిమాండ్.. సరఫరాలో అసమతుల్యతకు కారణమైందన్నారు.

ఇదిలా ఉంటే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. దాదాపు 11 రోజుల నుంచి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని, దీనికి మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాలే కారణమన గెహ్లోత్ అన్నారు. ‘యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయంగా ఉన్న ఇంధన ధరలకంటే ఇప్పుడు సగం ధరలే ఉన్నాయి. కానీ సామాన్యులకు చేరేసరికి వాటి ధరలు దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని స్థాయికి చేరాయ’ని విమర్శించారు. 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ సుంకం లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.20, డీజిల్‌పై రూ.3.46 మాత్రమే ఉండేదని, కానీ మోదీ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ సుంకం లీటరు పెట్రోల్‌పై రూ.32.90, డీజిల్‌పై రూ.31.80గా మార్చి సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా సామాన్యుని కాపాడేందుకు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని డిమాండ్ చేశారు.

శ్రీలంక, నేపాల్‌లో బీజేపీ పార్టీ ఏర్పాటు చేస్తాం, అమిత్ షా కోరిక అదే, సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిపుర సీఎం బిప్లాబ్ కుమార్ దేబ్, ప్రపంచవ్యాప్తంగా బీజేపీ అవసరం ఉందని తెలిపిన సీఎం

ఇక పెట్రో ధరలు పెరుగుతుండటంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికైనా నచ్చజెప్పేందుకు ఈ ధరలు తగ్గడం తప్ప మరొక సమాధానం లేదన్నారు. వినియోగదారులకు సమంజసమైన ధరకు పెట్రో ఉత్పత్తులు అందుబాటులో ఉండేవిధంగా రిటెయిల్ ధరలను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చలు జరపాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇంధనం ధరలు పెరగడానికి కారణం గత ప్రభుత్వాల విధానాలేనని పరోక్షంగా ఆరోపించారు. ప్రస్తుతం పెట్రో ధరలు పెరగడానికి కారణం మన దేశం అధికంగా దిగుమతులపైనే ఆధారపడటమని చెప్పారు. మనలాంటి వైవిధ్యభరితమైన, ప్రతిభా సంపన్న దేశం ఇంతగా ఇంధన దిగుమతులపై ఆధారపడవచ్చునా? అని ప్రశ్నించారు.

శనివారం 39 పైసలు పెరగడంతో లీటరు పెట్రోలు ధర ఢిల్లీ నగరంలో రూ.90కి చేరింది. లీటరు డీజిల్ ధర 37 పైసలు పెరిగి, రూ.80,97కు చేరింది. ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.97కు చేరి, సరికొత్త రికార్డు సృష్టించింది. లీటరు డీజిల్ ధర రూ.88.06కు ఎగబాకింది. మధ్య ప్రదేశ్‌లోని నగరబంధ్‌లో లీటరు పెట్రోలు ధర రూ.100.76కు చేరింది. ప్రీమియం వేరియంట్‌ను రూ.103.68కి విక్రయిస్తున్నారు. లీటరు పెట్రోలు ధర ఈ రాష్ట్రంలోని అలిరజపూర్‌లో రూ.99.45; బుర్హాన్‌పూర్‌లొ రూ.99.43కు చేరింది. రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్‌లో లీటరు పెట్రోలు ధర రూ.100.49కి చేరింది.