Chandigarh, February 17: పంజాబ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగించింది. మోగా, హోషియార్‌పూర్, కపుర్తలా, అబోహర్, పఠాన్‌కోట్, భటిండా, బాటలా మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలను (Punjab Civic Poll Results 2021) కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఏడు మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలు కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ (Congress Sweeps) చేసింది. ఇక గత 53 ఏళ్లుగా శిరోమణి అకాలీదళ్ కంచుకోటగా ఉన్న భాటిండాలో, గెలుపు బావుటా ఎగురవేయడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ట్విటర్‌లో షేర్ చేశారు.
బటిండా లోక్‌సభ నియాజకవర్గానికి శిరోమణి అకాలీదళ్ (సాద్) హర్‌సిమ్రత్ బాదల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాగు చట్టాలపై విభేదాల నేపథ్యలో ఆమె పార్టీ ఇటీవల బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకుంది. బటిండా అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మన్ ప్రీత్ సింగ్ బాదల్ (సాద్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బడింటా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం కావడంపై మన్ ప్రీత్ సింగ్ బాదల్ హర్షం వ్యక్తం చేశారు.'ఇవాళ చరిత్ర సృష్టించాం. 53 ఏళ్ల తర్వాత బటిండాకు కాంగ్రెస్ మేయర్ పదవి వరించింది. ఇంత అద్భుత విజయం అందించిన బటిండా ప్రజలకు కృతజ్ఞతలు. ఈరోజు కోసం ఎంతో శ్రమించిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులకు అభినందనలు' అని మన్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు.
ఇక ఎన్డీయే సర్కారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణా రైతులు సుదీర్ఘ కాలంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల ద్వారా కేంద్రంపై తమ అసహనాన్ని ప్రదర్శించేందుకు పంజాబ్ ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో 71.39 పోలింగ్ నమోదైంది. అదే విధంగా అనివార్య కారణాల వల్ల పోలింగ్ నిలిచిపోయన కొన్ని స్థానాల్లో తిరిగి మంగళవారం ఓటింగ్ జరిగింది. వీటి ఫలితాలు నేడే వెలువడనున్నాయి.
ఇక ఇప్పటికే ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు హస్తం ఖాతాలో పడటంతో బీజేపీకి భారీ షాక్ తగిలినట్లయింది. ఇన్నాళ్లు పార్టీకి బలంగా ఉన్న అర్బన్ ఓటర్ బేస్ ఒక్కసారిగా కోల్పోయినట్లయింది. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగిన బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు శిరోమణి అకాలీదళ్‌కు కూడా భాటిండాలో చేదు అనుభవం ఎదురైంది.
మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన 2,302 వార్డులు, 109 మున్సిపల్ కౌన్సిల్స్‌కు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 117 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా, 9వేలకు మించిన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలుచున్నారు. ఒకవైపు రైతుల ఆందోళనలు కొనసాగుతున్న నేపధ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఎంతో ఆసక్తికరంగా మారాయి.