Puducherry Political Crisis: కిరణ్ బేడి చక్రం తిప్పిందా..కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం, పుదుచ్చేరిలో నలుగురు ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు, ఇప్పటికే రాజీనామా చేసిన యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సీఎం నారాయణ స్వామి
Puducherry CM V Narayanasamy (Photo Credits: Facebook)

Puducherry, February 16: కేంద్రపాలిత ప్రాంతమైనలో ముఖ్యమంత్రి నారాయణస్వామి సర్కార్‌ మైనార్టీలో (Puducherry Political Crisis) పడిపోయింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి రాజీనామా చేశారు. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే రాజీనామాలు కాంగ్రెస్‌ పార్టీలో అక్కడ కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పుదుచ్చేరిలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల రాజీనామాలు ఆ పార్టీని కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

రెండు రోజుల క్రితమే యానం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు (Yanam MLA Malladi Krishna Rao) కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. మంగళవారం నాడు మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పుద్దుచ్చేరి రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. మరోవైపు తాజా పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారాయణస్వామి అత్యవసర కెబినేట్‌ సమావేశాన్ని (CM Narayanasamy calls cabinet meet) ఏర్పాటు చేశారు. ముఖ్యనేతలు, సీనియర్లతో విడివిడిగా సమావేశం అయ్యారు. పాండిచ్చేరిలో 2016 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి 15 సీట్లు గెలుచుకుంది. ఇక తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో వచ్చే మేలో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

మొత్తం 30 మంది శాసనసభ్యులు గల పుదుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్‌-డీఎంకే కూటమికి 16 మంది సభ్యుల మద్దతు ఉంది. విపక్షానికి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఇంటిపెండెంట్ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే తాజా రాజీనామాలతో అధికార పార్టీ బలం 11కి పడిపోయింది. ఇక, విపక్ష ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్‌సీ) 7 సీట్లు గెలుచుకోగా, దాని భాగస్వామ్య పార్టీ అన్నాడీఎంకే 4 సీట్లు గెలుచుకుంది. అయితే, లిఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ బీజేపీ నుంచి ముగ్గురిని నామినేట్ చేశారు. వీరికి ఓటింగ్ హక్కులు కూడా ఉన్నాయి. దీంతో 30 మంది సభ్యుల అసెంబ్లీ బలం 33కి చేరింది.

టీవీ, ఫ్రిజ్ ఉంటే రేషన్ కార్డు కట్, వెంటనే ప్రభుత్వానికి కార్డును తిరిగివ్వాలి, లేదంటే చట్టపరంగా చర్యలు తప్పవు, కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం, మండిపడుతున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ

కాగా యానం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మల్లాడి కృష్ణారావు.. నారాయణ స్వామి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత నెలలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా యానాం శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన మల్లాడి కృష్ణారావు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాంకు 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి గవర్నర్‌ కిరణ్ బేడీతో విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రజాస్యామ్యబద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని గవర్నర్ పనిచేయనీయడం లేదని, ప్రభుత్వ విధానాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని నారాయణ స్వామి ఆరోపిస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఇటీవల కలిసి గవర్నర్‌కు వ్యతిరేకంగా మెమొరాండం కూడా అందజేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ తనను బెదిరిస్తుండటంతో తమ విధులను స్వేచ్ఛగా నిర్వహించలేకపోతున్నామంటూ రాష్ట్రపతికి ఆయన ఫిర్యాదు చేశారు.

శ్రీలంక, నేపాల్‌లో బీజేపీ పార్టీ ఏర్పాటు చేస్తాం, అమిత్ షా కోరిక అదే, సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిపుర సీఎం బిప్లాబ్ కుమార్ దేబ్, ప్రపంచవ్యాప్తంగా బీజేపీ అవసరం ఉందని తెలిపిన సీఎం

ప్రధాని నరేంద్ర మోదీ, కిరణ్ బేడీ కలిసి తన ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు, పాండిచ్చేరిని తమిళనాడులో కలిపేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నారాయణ స్వామి ఆరోపిస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయకుండా అడ్డుపడుతున్నారని ఆయన అంటున్నారు.