Congress Fact-Finding Panel: ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్ నిజనిర్థారణ కమిటీ, అమిత్ షా రాజీనామా చేయాలన్న సోనియా గాంధీ, మాకు రాజధర్మం నేర్పవద్దని రవిశంకర్ ప్రసాద్ చురకలు
Congress president Sonia Gandhi | (Photo Credits: ANI)

New Delhi, Febuary 29: దేశ రాజధాని నివురుగప్పిన నిప్పులా ఉంది. ముఖ్యంగా ఈశాన్య ఢిల్లీ అల్లర్లతో (Delhi violence) భగ్గుమంటోంది. ఇదిలా ఉంటే పార్టీలు అక్కడ జరుగుతున్న అల్లర్లపై విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఢిల్లీ ఘర్షణలకు సంబంధించి కేంద్రంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది.

42కి చేరిన మృతుల సంఖ్య, షాక్ నుంచి ఇంకా తేరుకోని ఈశాన్య ఢిల్లీ వాసులు

ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి మెమొరాండం సమర్పించారు. ఢిల్లీ హింసకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని ఆదేశించాలని వారు రాష్ట్రపతిని కోరారు.

అలాగే ఢిల్లీలో అల్లర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని కాంగ్రెస్‌ పార్టీ (Congress) ఆరోపణలు చేస్తోంది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీ (Congress Fact-Finding Panel) ఏర్పాటు చేస్తున్నట్టు సోనియా గాంధీ తెలిపారు. ఈ బృందం ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈ కమిటీలో ముకుల్‌ వాస్నిక్‌, తారిక్ అన్వర్, సుష్మితా దేవ్, శక్తిసిన్హా గోహిల్‌, కుమారి సెల్జా సభ్యులుగా ఉన్నారు.

Congress Fact-Finding Panel

ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో ఈ కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. అనంతరం సమగ్ర వివరాలతో కూడిన నివేదికను సోనియాగాంధీకి అందజేయనున్నారు. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో 42 మంది మృతిచెందగా, 300 మందికిపైగా గాయపడ్డారు.

ఢిల్లీకి కొత్త పోలీస్‌ కమిషనర్‌, అల్లరి మూకల పని పట్టనున్న ఎస్ఎన్ శ్రీవాస్తవ

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్: కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ వ్యాఖ్యలపై న్యాయశాఖ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) మండిపడ్డారు. తమకు రాజధర్మం నేర్పడానికి ప్రయత్నించొద్దని చురకలంటించారు. కాంగ్రెస్ పాలన మొత్తం ఓటు బ్యాంకు రాజకీయాలతో నిండిపోయిందని ఆరోపించారు. అలాంటప్పుడు తమకు నీతిబోధలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన మొత్తం అల్లర్లు, ఓటు బ్యాంకు రాజకీయాలేనని దుయ్యబట్టారు.

Here's Ravi Shankar Prasad Video

తమకు రాజధర్మం నేర్పడానికి ప్రయత్నించొద్దని చెప్పారు. శాంతి కోసం కలిసికట్టుగా ప్రయత్నించాల్సిన ఇటువంటి సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ అల్లర్లు జరిగిన రోజు నుంచి హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారని, ఈ హింసాకాండకు కారణమైన ఎవరినీ వదిలేది లేదని స్పష్టంచేశారు.

ఉద్దవ్ థాకరే : ‘‘ఢిల్లీలో తీవ్ర స్థాయిలో అల్లర్లు జరిగాయి. కానీ అమిత్ షా ఎక్కడున్నారో తెలియడం లేదు. దీని గురించి ఆయన ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు. కానీ ఢిల్లీ అగ్నిగుండంలా మారితే అమిత్ షా ఎక్కడున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. అల్లర్లు జరుగుతున్న తరుణంలో అజిత్ దోవల్ రోడ్లపై కనిపించారు. ప్రజా సమూహాలతో మాట్లాడారు కూడా. మరి అమిత్ షా ఎక్కడా కనిపించలేదు. కానీ ఆయన ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం కనిపించారు’’ అని ఉద్దవ్ థాకరే (Uddhav Thackeray) అన్నారు.

దర్యాప్తును వేగవంతం చేసిన సిట్ 

ఈ అల్లర్లపై దర్యాప్తును వేగవంతం చేసినట్లు దర్యాప్తు సంస్థ సిట్ తెలిపింది. అల్లర్లకు గల కారణాలను, అల్లర్ల కారకులకు సంబంధించిన కూపీ లాగుతున్నట్లు, దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు నిందితులు తమ అదుపులో ఉన్నారని వారి నుంచి తుపాకీలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. పట్టుబడ్డ వారిపై గతంలో జరిగిన పలు నేరాల్లో నిందితులని చెప్పారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కారణం మారణాయుధాల సరఫరా అని సిట్ అనుమానం వ్యక్తం చేసింది. తమ ప్రాథమిక అంచనాల ఆధారంగా విచారణ చేస్తామని సిట్ అధికారులు పేర్కొన్నారు.