New Delhi, August 24: కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు కోసం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం (Congress Working Committee Meet) ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశంలో ప్రస్తుతానికి సోనియా గాంధీనే (Sonia Gandhi) తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగాలని పార్టీ ముఖ్య నేతలంతా సీడబ్ల్యూసీలో (CWC Meet) తీర్మానించారు. రాబోయే 6 నెలల్లో పార్టీ కొత్త చీఫ్‌ను (New Congress President) ఎన్నుకోనున్నట్లు తెలిపారు. దీంతో.. నాయకత్వ బాధ్యతల నుంచి సోనియా తప్పుకోనున్నారన్న వార్తలకు తెరపడింది. సోనియా రాజీనామా చేశారని, ఇక రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్ ముందుకెళ్లనుందనే వార్తలు తెరపైకొచ్చాయి. అయితే.. సీడబ్ల్యూసీ తాజా ప్రకటనతో ప్రస్తుతానికి ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది.
ఇదిలా ఉంటే 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు రాసిన లేఖ తనను తీవ్రంగా బాధించిందని సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. అయితే ఆ లేఖ రాసిన వాళ్లంతా తన సహచరులే అని ఆమె వ్యాఖ్యానించారు. ఈరోజు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి సోనియా కీలక ప్రసంగం చేశారు. సీనియర్ నేతలు రాసిన లేఖ నన్ను తీవ్రంగా బాధించింది. కానీ వాళ్లంతా నా సహచరులే. జరిగిందేదో జరిగిపోయింది. మీరంతా బీజేపీతో కుమ్మక్కయ్యారు, సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీ ఆగ్రహం,పెను ప్రకంపనలు రేపిన అధినాయకత్వ మార్పు లేఖ
పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేద్దాం. 6 నెలల్లో ఏఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోండి’’ అని సోనియా సూచించారు. వాస్తవానికి సోనియా గాంధీ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటారని అనుకున్నప్పటికీ పార్టీ శ్రేణులు ఒత్తిడి చేయడంలో మరో ఆరు నెలల పాటు తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగేందుకు ఒప్పుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
అంతకుముందు సీడబ్ల్యూసీ సమావేశంలో సీనియర్ నేతల తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడం కాంగ్రెస్‌లో కలకలం రేపింది. నాయకత్వ మార్పుపై బీజేపీ ప్రోద్బలంతోనే సీనియర్లు లేఖ రాశారన్న రాహుల్ వ్యాఖ్యలపై కపిల్ సిబల్, ఆజాద్ వంటి సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ నేతలను అనునయించేందుకు స్వయంగా రాహుల్ వివరణ ఇచ్చారు. తాను సీనియర్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. అధ్యక్ష మార్పు లేఖ ప్రకంపనలు, కొత్త అధినేతను ఎన్నుకోవాలని కోరిన సోనియా గాంధీ
మరోవైపు పార్టీ నాయకత్వపై సోనియా గాంధీకి లేఖ రాసిన వారిపై పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నేత అంబికా సోనీ కోరగా, తాము పార్టీ పరిధికి లోబడే ఆయా అంశాలను లేవనెత్తామని గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ పేర్కొన్నారు. ఇది క్రమశిక్షణ ఉల్లంఘనే అని భావిస్తే తమపై చర్యలు చేపట్టవచ్చని అన్నారు. కాగా పార్టీ యువనేతలతో పాటు పలువురు సీనియర్ నేతలు, పార్టీ ముఖ్యమంత్రులు తాజా పరిణామాల నేపథ్యంలో గాంధీ కుటుంబానికి బాసటగా నిలిచారు