Bhopal, Nov 8: మధ్యప్రదేశ్‌లోని (Madhyapradesh) రేవా (Rewa) బీజేపీ ఎంపీ (BJP MP) జనార్దన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం (Liquor) తాగాలని, గుట్కా (Gutka) నమలాలని, థిన్నర్ పీల్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రేవాలో నీటి పరిరక్షణపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. నీళ్లు లేక భూములు ఎండిపోతున్నాయని, కాబట్టి వాటిని రక్షించాలని పేర్కొన్న ఆయన.. ‘‘గుట్కా నమలండి, మద్యం తాగండి, థిన్నర్‌ను పీల్చండి. సులేసాన్ (ఒక రకమైన జిగురులాంటి పదార్థం) లేదంటే ఐయోడెక్స్ తినండి. కానీ, నీళ్ల ప్రాముఖ్యతను మాత్రం అర్థం చేసుకోండి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
రేవాలోని కృష్ణరాజ్ కపూర్ ఆడిటోరియంలో ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఏదైనా ప్రభుత్వం నీటి పన్నులు మాఫీ చేస్తామని చెబితే నీటి పన్నులను తాము చెల్లిస్తామని, కరెంటు బిల్లులు సహా ఇతర పన్నులను మాఫీ చెయ్యాలని కోరాలని జనార్దన్ మిశ్రా ప్రజలను కోరారు. మిశ్రా వార్తల్లోకి ఎక్కడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండడం ఆయనకు పరిపాటే. ఇటీవల ఆయన ఉత్త చేతులతో టాయిలెట్‌ను శుభ్రం చేసిన వీడియో వైరల్ అయింది.