New Delhi, June 2: దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19న ఎన్నికలు (Rajya Sabha Polls) జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం (EC) సోమవారం ప్రకటించింది. వీటిలో కరోనా కారణంగా వాయిదా పడిన స్థానాలు 18 ఉండగా.. మిగిలిన ఆరు స్థానాలు తాజాగా ఖాళీ అయ్యాయి. వీటన్నింటికి కలిపి ఎన్నికలు జరుగనున్నాయి. వాస్తవానికి మార్చి 26న 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కరోనా కారణంగా అవి వాయిదా పడ్డాయి. కాగా, 55 స్థానాలకు 37 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో తాజాగా 82 కేసులు నమోదు, రాష్ట్రంలో 3,200కు చేరిన కరోనా కేసులు, ఏపీ సీఎం ఢిల్లీ టూర్ వాయిదా
మిగిలిన స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నాలుగు చొప్పున, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల నుంచి మూడు స్థానాల చొప్పున, జార్ఖండ్ నుంచి రెండు, మణిపూర్, మేఘాలయల్లో ఒక్కో స్థానానికి తాజాగా ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు కర్ణాటక (4), అరుణాచల్‌ప్రదేశ్ (1), మిజోరం (1)లలోని ఆరు స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఏపీలో (Andhra Pradesh) 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అధికార వైఎస్సార్సీపీ (YSRCP) నాలుగు స్థానాల్లో తమ అభ్యర్థలను నిలపగా. ప్రతిపక్ష టీడీపీ (TDP) ఒక స్థానంలో అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఆ పార్టీ నుంచి వర్ల రామయ్య రాజ్యసభ సీటుకు పోటీలో ఉన్నారు. వైఎస్సార్సీపీ తరఫున ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణా రావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని నామినేషన్‌లు దాఖలు చేశారు. 5వ అభ్యర్థి పోటీలో ఉండటంతో ఈ నెల 19న పోలింగ్ నిర్వహించనున్నట్లు అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.