N. Chandrababu Naidu, Amaravathi Tour | Photo: ANI

Amaravathi, November 28:  టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) అమరావతిలో పర్యటిస్తున్నారు. తన నివాసానికి సమీపంలో ఇటీవల జగన్ ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక ప్రాంతం మొదలుకొని ఇతర నిర్మాణాలను పరిశీలించేందుకు టీడీపీ నాయకులతో కలిసి ఒక బస్సులో బయలుదేరి వెళ్లారు. రాజధాని (Capital City) ప్రాంతంలో టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మాణాలు, రహదారుల పరిస్థితి ఎలా ఉంది? జగన్ ప్రభుత్వం ఏదైనా పురోగతి సాధించిందా? అనే విషయాలను పరిశీలిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అయిన అమరావతిని కాపాడుకునేందుకేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

మరోవైపు, తన పర్యటన మార్గంలో చంద్రబాబు అడుగడుగునా రైతుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రంగురంగుల గ్రాఫిక్స్ చూపించి రైతులను మోసం చేశారు, చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అంటూ రోడ్డు పక్కన భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. నల్లటి ప్లకార్డులతో చంద్రబాబు పర్యటన పట్ల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ (YS Jaganmohan Reddy) కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Farmers protest against N. Chandrababu Naidu

అలాగే కొంత మంది రైతులు సీఎం జగన్ వ్యతిరేక నినాదాలు చేస్తూ చంద్రబాబు పర్యటనను స్వాగతించారు. ఈ నేపథ్యంలో రైతులు రెండు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తుంది.  రాజధాని 'అమరావతి'ని తరలిస్తున్నారా?

ఇదే క్రమంలో, చంద్రబాబు కాన్వాయ్ సీడ్ యాక్సెస్ రోడ్డుకు చేరుకోగానే ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై కొంతమంది చెప్పులతో, రాళ్లతో దాడి చేశారు. నేరుగా చంద్రబాబు కూర్చున్న కిటికీవైపే చెప్పులను విసిరారు. ఈ సందర్భంగా టీడీపీ- వైసీపీ కార్యకర్తల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొంది.