Amaravathi, December 7: నెల్లూరు జిల్లా( psr nellore district) టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Beeda Masthan Rao Joins YSRCP) తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy)సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. వైసీపీ పార్టీలో చేరిన అనంతరం బీద మస్తాన్‌రావు(Beeda Masthan Rao) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు.
అనతి కాలంలోనే 80 శాతంపైగా ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఎలక్షన్ మ్యానిఫెస్టోను వైఎస్సార్ సీపీ భగవద్గీత, బైబుల్, ఖురాన్‌గా భావిస్తోందని, ఆయన పరిపాలన నచ్చడంతోనే వైసీపీలో చేరానని అన్నారు. తనకు రాజకీయంగా ఎవరితోనూ వ్యక్తిగత విబేధాలు లేవని స్పష్టం చేశారు. కాగా బీద మస్తాన్‌రావు శుక్రవారం తెలుగుదేశం పార్టీతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. టీడీపీలో సరైన గౌరవం ఇవ్వకపోవడంతో బీద మస్తాన్‌రావు ఆ పార్టీని వీడారని తెలుస్తోంది.
2009లో కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన మస్తాన్ రావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత 2014లో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఇటీవల ముగిసిన సాధారణ ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేసే వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ఇటీవల సీఎం జగన్ ఆహ్వానం మేరకు మత్సకార సమావేశంలో పాల్గొన్నారు. స్వతహాగా చేపల ఎక్స్పోర్ట్ వ్యాపారంలో ఉన్న మస్తాన్ రావును మత్సకార కమిటీలో సభ్యుడిగా సీఎం జగన్ నియమించారు . దాంతో అప్పుడే ఆయన పార్టీ మారుతారని ఊహాగానాలు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో టీడీపీలో కీలకనేత అది కూడా బీసీ సామాజికవర్గంలో బలమైన నేతగా ఆయన గుర్తింపుపొందారు. ఒకానొక దశలో టీడీపీ నుంచి మస్తాన్ రావును రాజ్యసభకు పంపుతారని ఊహాగానాలు వచ్చాయి. ఇదిలా ఉంటే జిల్లాలో స్థానిక సంస్థలకు గాను ఒక ఎమ్మెల్సీ వస్తుంది కాబట్టి ఆ స్థానాన్ని బీద మస్తాన్ రావు కు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.