Gannavaram, October 29: గన్నవరం కేంద్రంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు జరుగుతున్నాయి. గన్నవరం నియోజకవర్గం (Gannavaram Constituency) ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) తన ఎమ్మెల్యే పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. నవంబర్ మొదటి వారంలోనే ఆయన వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిని నివారించేందుకు టీడీపీ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వల్లభనేని వంశీని ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీలోకి వెళ్లనీయకుండా చివరి వరకు ఆయనను బుజ్జగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, విజయవాడ ఎంపీ కేశినేని నానికి బాధ్యతలు అప్పజెప్పారు.
ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ, వల్లభనేని వంశీ రక్తంలో టీడీపీ డీఎన్ఏ ఉందని, ఆయనకు ఎక్కడకు వెళ్లరని వ్యాఖ్యానించారు. ఇటు చంద్రబాబు కూడా వల్లభనేనిపై సానుభూతిపరమైన వ్యాఖ్యలు చేస్తూ దీనికంతా జగన్ ప్రభుత్వం వేధింపులే కారణం అంటూ ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ వారిని వేధిస్తున్నారని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. మొన్న చింతమనేని, అఖిల ప్రియ నేడు వల్లభనేనిపై తప్పుడు కేసులు పెట్టారు, తప్పుడు కేసులతో కోడెలను బలితీసుకున్నారు. ఎన్ని చేసిన టీడీపీకి కార్యకర్తల అండ ఉందని చంద్రబాబు అన్నారు. వైసీపీ అరాచకాలన్నీ మానవ హక్కుల కమీషన్ వద్ద ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు ఆయన దిశానిర్ధేశం చేశారు.
చంద్రబాబు ఆలోచనలను బట్టి, ఎలాగైనా వల్లభనేని వంశీ పార్టీ వీడకుండా చూడటం ఒకటైతే, ఒకవేళ అది సాధ్యం కాని పక్షంలో ప్రజల సానుభూతి టీడీపీకే వచ్చేలా ఆయన ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు జగన్ ప్రభుత్వం ఇప్పటికే ఇక్కడ ఉపఎన్నికపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. వంశీ రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమవుతుంది. ఈ ఉపఎన్నికలో గెలిచి తమ ప్రభుత్వంపై ఎలాంటి ప్రజావ్యతిరేకత లేదని చాటుకోవటానికి వీలవుతుంది. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వ ఫార్ములాపై జగన్ ఇప్పటికే దృష్టిపెట్టారని 'సమయం మీడియా' ఒక విశ్లేషణ చేసింది.
తన ప్రభుత్వంపై ఒకవైపు ప్రతిపక్షాల తీవ్ర ఆరోపణలు, మరోవైపు ఆర్టీసీ సమ్మె జరుగుతున్న సమయంలో హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని బంపర్ మెజారిటీతో గెలిపించుకోవడం ద్వారా తమ ప్రభుత్వంపై ఎలాంటి ప్రజావ్యతిరేకత లేదని కేసీఆర్ చాటుకున్నారు. అదేవిధంగా గన్నవరంలో వైసీపీ అభ్యర్థిని బంపర్ మెజారిటీతో గెలిపించుకొని ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టేందుకు ఈ ఉపఎన్నిక ఒక అవకాశంగా జగన్ ప్రభుత్వం భావిస్తుందని సమయం ఒక విశ్లేషించింది.
ఇదంతా జరగాలంటే వల్లభనేని వంశీ వైసీపీలో చేరడంతో పాటు, ఆయన శాసనసభ సభ్యత్వాన్ని స్పీకర్ ఆమోదించాలి. దీంతో ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది అనేది ఇటు టీడీపీ, అటు వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే నవంబర్ 03న వైసీపీలో ఆయన చేరిక ఖరారైనట్లు ఇప్పటికే పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా, వంశీ రాకను వైకాపా నేత యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై ఆయన తమ అధినేత జగన్ ను కలిసేందుకు వెళ్లినా, ఆయనకు జగన్ అపాయింట్ మెంట్ దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన యార్లగడ్డ, ఒకవేళ వంశీకి వైసీపీ టికెట్ లభిస్తే తాను స్వతంత్ర అభ్యర్థిగా ఆయనపై పోటీచేస్తానని యార్లగడ్డ స్పష్టంచేశారు.