GHMC Election Results 2020 |

Hyderabad, December 4: జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ లో మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా పోస్టల్ బ్యాలెట్లో అధికార పార్టీ టీఆర్ఎస్ కన్నా బీజేపీకి ఆధిక్యం లభిస్తుంది. ఉదయం 10:30 వరకు వచ్చిన ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 85 స్థానాల్లో ఆధిక్యత కనబరచగా, తెరాస 34 చోట్ల ఆధిక్యాన్ని కనబరుస్తుంది., ఎంఐఎం 18 చోట్ల ఆధిక్యంలో ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువగా ఉద్యోగుల ఓట్లు ఉంటాయి కాబట్టి దీనిని బట్టి ఇప్పుడే ఫలితాల ట్రెండ్స్ ను అంచనావేయలేమని విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో 76 లక్షల 67 వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరిగినందున ఫలితాలు కాస్త ఆలస్యమైనా, ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం మూలానా కొన్ని చోట్ల వెంటనే ఫలితాలు తేలనున్నాయి. మధ్యాహ్నానికి తొలి ఫలితం రానుంది. అత్యంత తక్కువ ఓట్లు పోలైన మెహదీపట్నం డివిజన్ ఫలితం తొలి రౌండ్ లోనే తేలిపోనుంది.

ఇదిలా ఉంటే, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిన్న అర్ధరాత్రి జారీ చేసిన ఓ సర్క్యులర్ ను హైకోర్ట్ సస్పెండ్ చేసింది. బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ చిహ్నమే కాకుండా పోలింగ్ కేంద్రం సంఖ్యను తెలిపే ముద్ర ఉన్నా, దానిని ఓటుగానే పరిగణించాలని రాష్ట్ర ఈసీ గురువారం అర్ధరాత్రి సర్క్యులర్ జారీచేసింది. దీనిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ బీజేపీ మరియు కాంగ్రెస్ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో దీనిపై అత్యవసరంగా విచారించిన హైకోర్ట్, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిర్ణయానికి బ్రేకులు వేసింది. స్వస్తిక్ ముద్రగల పత్రాన్ని మాత్రమే ఓటుగా పరిగణించాలని ఈసీకి స్పష్టం చేసింది.