Panaji, Sep 21: గోవాలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (Goa Assembly Elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రధాన పార్టీలో ప్రచారానికి తెరలేపాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ (Arvind Kejriwal) అక్కడ ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పనాజీలో మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ గోవా యువతకు ఆయన ప్రామిస్ చేశారు.
ప్రతి ఇంట్లో ఒకరికి ఉద్యోగం వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ తాము అధికారంలోకి వస్తే, ప్రతి ఒక నిరుద్యోగికి మూడు వేల నిరుద్యోగ భృతి (unemployment allowance) ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. 80 శాతం ఉద్యోగాలు గోవా యువతకే రిజర్వ్ చేస్తామన్నారు. ప్రైవేటు సంస్థల్లోనూ వాళ్లకే 80 శాతం ఉద్యోగాలు దక్కేలా చేస్తామన్నారు.
టూరిజంపై ఆధారపడ్డ కుటుంబాలు కోవిడ్ వల్ల దెబ్బతిన్నాయని, అయితే వారికి నెలకు 5వేలు ఇస్తామన్నారు. గనులను మూసివేయడం వల్ల కూడా మైనింగ్ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, వారికి కూడా పనులు మొదలయ్యే వరకు నెలకు 5వేలు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.