Harish Rao: మూడు రాజధానుల అంశంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు, పిల్లల చదువుపై తీవ్ర అసంతృప్తి, పదో ఎక్కమే చెప్పలేని వాళ్లు పది ఎలా పాసవుతారన్న మంత్రి, విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆదేశాలు
harish-rao-hot-comments-on-ap-capital-row (photo-PTI)

Hyderabad, December 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అంశం తెలంగాణకు కలిసి వస్తుందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు. ప్రస్తుతం ఏపీ (AP)రాష్ట్రంలో రాజధానిపై స్పష్టమైన క్లారిటీ లేకపోవడం వల్ల ప్రస్తుత పరిస్థితులు తెలంగాణ (Telangana) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కలిసి వస్తాయని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ (Real Estate)రంగం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉందని అన్నారు. బ్యూరోక్రాట్లు వ్యాపార వేత్తలు హైదరాబాద్‌లో (Hyderabad)స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

క్రెడాయ్ తెలంగాణ సమావేశంలో మాట్లాడిన మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రియల్‌ ఎస్టేట్‌ రంగానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రంలోని పెద్ద బిల్డర్లు సామాజిక బాధ్యతగా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. చెన్నైలో మంచినీటి సమస్య, బెంగళూరులో ట్రాఫిక్‌, ఢిల్లీలో కాలుష్యం, ముంబైలో అధిక ధరలు ఉంటే హైదరాబాద్‌లో అటువంటి సమస్యలు లేకపోవడం తెలంగాణకు కలిసివచ్చే విషయం అని అన్నారు హరీష్ రావు.

ఇదిలా ఉంటే పాఠశాల విద్యార్థుల ప్రతిభాపాటవాల పట్ల మంత్రి హరీశ్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన శనివారం సంగారెడ్డి జిల్లా కందిలోని జిల్లా పరిషత్‌ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన వసతిని పరిశీలించారు. అదే విధంగా తరగతి గదిలోకి వెళ్లి అక్కడి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేశారు. 10వ తరగతి విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లోని ప్రశ్నలు అడిగి.. వారి విజ్ఞానాన్ని పరీక్షించారు.

అయితే మంత్రి హరీశ్ రావు అడిగిన ప్రశ్నలకు అక్కడి విద్యార్ధులు కనీసం సమాధానాలు కూడా చెప్పలేకపోవడం తీవ్ర అసంతృప్తి లోనయ్యారు. మంత్రి తెలుగులో రాయమన్న పేర్లను కూడా విద్యార్థులు బోర్డుపై రాయలేకపోయారు. ఈ తీరుపై పాఠశాల ఉపాధ్యాయులను మంత్రి హరీష్‌ ప్రశ్నించారు. వారి బోధన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు పదకొండో ఎక్కం రాయమంటే నాకు రాదు.. నాకు పదో ఎక్కం వరకే వచ్చని చెప్పేసింది. దీంతో హరీష్ రావు వెంటనే 10 తరగతి కాబట్టి పది ఎక్కాలే నేర్పించారా మీ సార్ అని తల పట్టుకుని చదువులు ఇలా ఏడిస్తే ప్రపంచంతో ఎలా పోటీపడతారని అన్నారు. చివరిగా పాఠశాల విద్యకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని, విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించాలని మంత్రి ఆదేశించారు.