థర్డ్ ఫ్రంట్లు, ఫెడరల్ ఫ్రంట్లు, మహా కూటమి, మషానం కూటమి అంటూ రకరకాల పేర్లతో మన దేశంలో రాజకీయ నాయకులు ఇతర పార్టీ నాయకులతో, పార్టీలతో చేతులు కలుపుతారు, కూటములు ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ జెండాలు ఏమైనా సరే అజెండా మాత్రం అధికారమే. కనుచూపు మేరలో 'కుర్చీ' కనిపిస్తే చాలు. ఆ కుర్చీ ఎక్కేందుకు కావాల్సిన సంఖ్యాబలం లేకపోయినా సరే , ఏదో ఒకటి చేసైనా ఆ కుర్చీ మీద ఎక్కి కూర్చునేందుకు ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టరు. ఇక్కడ గొప్పగా చెప్పుకునే పార్టీ సిద్ధాంతాలు, కట్టుబాట్లు అన్నీ కూడా ఆ క్షణాణ అప్పటికప్పుడు మారిపోతాయి. అంతకుముందు ఒకరినొకరు ఎంత దుమ్మెత్తిపోసుకున్నా సరే, ఆ శత్రువులందరూ అప్పటికప్పుడు మిత్రులయిపోతారు. నిన్నటివరకు కలుషితం అనుకున్న పార్టీలు ఒక్కసారిగా పరమ పవిత్రమయిపోతాయి. ఆ సమయంలో వారికి ఓట్లు వేసిన ప్రజలు ఎవ్వరూ గుర్తుకురారు, కార్యకర్తల భావోద్వేగాలు పట్టవు. మొత్తానికి అనుకున్నది సాధించేసి అడ్డగోలుగా సింహాసనం అధిష్టిస్తారు. ఇక ఇక్కడ మొదలవుతుంది అసలు కథ. కుర్చీకోసం అంతవరకు చేసింది ఒక ఎత్తు, దానిని కాపాడుకునేందుకు చేసేది మరో ఎత్తు. అది సింహాసనం మామూలుగా ఉండదు, కింద మంట ఉంటుంది, పైనుంచి ముళ్ల కంప ఉంటుంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాజ్యం పాలన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఎంత సింహాసనం ఎక్కి కూర్చున్నా, రాజుగా చెలామణి అవుతున్నా, అందరికీ వంగివంగి దండాలు పెట్టాల్సిందే. వారేం చెప్పినా అన్నీ మూసుకుని జీహుజూర్ అని చెప్పినట్లు పడి ఉండాల్సిందే. వారికివాల్సిన గౌరవ మర్యాదల్లో ఏమాత్రం తేడా వచ్చిన ఆ సింహాసనం కుప్పకూలుతుంది. సరైన సంఖ్యాబలం లేని సంకీర్ణ ప్రభుత్వాలు ఎంతోకాలం నిలవవు దానికి తాజా ఉదాహారణ కర్ణాటక రాష్ట్రంలో మూన్నాళ్లకే కుప్పకూలిన కుమార స్వామి ప్రభుత్వం.

అంతకుముందు - ఆ తరువాత ఏం జరిగింది?

ఫస్ట్ ఇన్నింగ్స్ 2018

కర్ణాటకలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3 ప్రధాన జట్లు పోటీపడ్డాయి. అవి బీజేపీ, కాంగ్రెస్ మరియు ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్. ఎలక్షన్ల సందర్భంగా ఈ ముగ్గురు ఒకరిపైఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. వీరి తమాషా చూసిన కన్నడ ప్రజలు అన్ని పార్టీలకు ఝలక్ ఇచ్చారు. ఎవ్వరికీ సరైన మెజారిటీ ఇవ్వలేదు. దీంతో హంగ్ ఏర్పడింది.

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 224, ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సీట్ల సంఖ్య 113.

ఇక పార్టీల స్కోర్లు వివరాలు ఇలా ఉన్నాయి.

బీజేపీ - 104

కాంగ్రెస్ - 80

జేడీఎస్ (కుమారస్వామి పార్టీ) - 37

ఇతరులు - 3

ఇక్కడ బీజేపి 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే 'మేజిక్ ఫిగర్' కు 9 సీట్ల దూరంలోనే ఆగిపోయింది. అయితే 80 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా అడుగులు వేసింది. నేరుగా ఢిలీ అధిష్టానం, సోనియా గాంధీ రంగంలోకి దిగి 37 సీట్లు ఉన్న జేడీఎస్ తో జత కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించింది. ఇక్కడ కుమార స్వామి గణం ముఖ్యమంత్రి పదవి తమకి ఎవరు ఇస్తే వారికే మా మద్ధతు అని ప్రకటించారు. బీజేపీకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని వెంటనే కుమార్ స్వామితో డీల్ కుదుర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది.

కుమారస్వామి సీఎం అయితే అయ్యారు కానీ, అధికారం అంతా కాంగ్రెస్ తన గుప్పిట్లోనే ఉంచుకుంది. తనకు తెలుసు కాంగ్రెస్ తో వేగటం అంత ఈజీ కాదని. తన ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలవదు అని బాగా తెలుసు. అందుకోసమే సీఎంగా ఉన్న కుమారస్వామి రానున్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రజల అటెన్షన్ పొందేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. ఏదైనా పబ్లిక్ మీటింగ్ నిర్వహించేటపుడు 'ప్రభుత్వం నడపడమే కష్టమవుతుంది, లేకపోతే మీకోసం ఎంతో చేయాలనుంది' అంటూ పదేపదే జాలిపడే మాటలు చెప్తూ ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు ప్రయత్నించారు.

సీన్ కట్ చేస్తే, 2019 రెండో ఇన్నింగ్స్.

కుమారస్వామి ఎలాగో అలా ఒక ఏడాది పాటు ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కానీ, ఆయన ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల తరువాత కుమారస్వామి శిబిరంలో కలకలం. ఆయన బ్యాచ్ కు చెందిన ఎమ్మెల్యేలే తమకు ఈ ప్రభుత్వం పనితీరు మీద సంతృప్తి లేదని, కుమారస్వామికి మద్ధతు ఉహరించుకుంటున్నట్లు రెబల్స్ గా మారిపోయారు. కాంగ్రెస్ + జేడీఎస్ కూటమికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కర్ణాటకలో ఒక్కసారిగా రాజకీయ సంక్షోభంలో ఏర్పడింది. దీంతో కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. దీంతో కుమారస్వామి వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెరిగింది. మరోవైపు బలం నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ కూడా ఆర్డర్ వేశాడు. ఇటువైపు ఎన్ని ప్రయత్నాలు చేసినా రెబల్ ఎమ్మెల్యేలు మెట్టు దిగలేదు. దీంతో కుమారస్వామికి అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య చూపించుకోవాల్సిన పరిస్థితి తప్పనిసరైంది.

15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 103

బిజేపికి అప్పటికే ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 105

కుమారస్వామికి ఉన్న ఎమ్మెల్యేల బలం 99 మాత్రమే దీంతో అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం 6 ఎమ్మెల్యేల లోటుతో ఓటమి పాలైంది.

దీంతో మే 23, 2018లో ఏర్పడిన కుమారస్వామి ప్రభుత్వం కేవలం 14 నెలల వ్యవధిలోనే జూలై 23, 2019న కుప్పకూలింది. అప్పటివరకూ సీఎంగా ఉన్న కుమారస్వామి, స్పీకర్ సురేష్ ఇతర మంత్రులందరూ ఒక్కసారిగా మాజీలు అయిపోయారు.

ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య బీజేపీకి ఉండటంతో ఆపై కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి, ఇటు కర్ణాటక రాష్ట్రంలోనూ 'పవర్'గేమ్ ఆడి, అధికారాన్ని బదలాయించుకొని కర్ణాటక రాజ్యంపై తన జెండా ఎగురవేసింది.

కర్ణాటకలో మళ్ళీ ఎన్నికలకు 2023 వరకు సమయం ఉంది. మరి అప్పటివరకు బీజేపి అయినా కాంగ్రెస్ + జేడీఎస్ నుంచి లాగేసుకున్న ఈ  అధికారాన్ని నిలుపుకుంటుందా, మళ్ళీ ఏమైనా ట్విస్టులు వచ్చి బీజేపీ నుంచి కూడా అధికారం చేతులు మారుతుందా అనేది చూడాలి. పిక్చర్ అభీ బాకీ హై!