JAGAN vs KCR: బ్రేకప్ స్టోరీ! తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య ఆర్టీసీ చిచ్చు, ఏపీలో ఆర్టీసీ విలీనం ఏమీ లేదు అని కేసీఆర్ చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే విలీనంపై ముందడుగు వేసిన జగన్, మిత్రులిద్దరికీ చెడినట్లేనా?
File Images of AP CM Jagan & TS CM KCR.

Hyderabad, October 25: గతంలో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య 'నువ్వా-నేనా' అన్నట్లు సాగిన వార్, గత ఎన్నికల తర్వాత చంద్రబాబు దిగిపోయి జగన్ సీఎం (YS Jagan)అయిన తర్వాత మళ్ళీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య 'నువ్వు-నేను' అన్నట్లుగా ప్యార్ మొదలైంది.  జగన్ -  కేసీఆర్‌ల మధ్య రాకపోకలు, మర్యాదపుర్వక భేటీలు, బోకేలు- గిఫ్ట్‌లు ఇచ్చుకోవడాలు జోరుగా సాగాయి. అయితే వీరి ప్యార్ కహానీకి బ్రేకప్ చెప్పుకునే టైం దగ్గర పడినట్లే అనిపిస్తుంది. దానికి కారణం ఆర్టీసీ! అవును వీరిద్దరి మధ్యలో ఆర్టీసీ గొడవకు కారణం అయ్యింది. అప్పటివరకు సంయుక్త తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇరు రాష్ట్రాలకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకునే ఈ ఇరువురు ముఖ్యమంత్రులు, ఆర్టీసీ విషయంలో మాత్రం తేడాలు వచ్చాయి.

నెలరోజుల క్రితం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి  'ఏపీఎస్ ఆర్టీసీ'ని ప్రభుత్వంలో విలీనం (APS RTC Merge) చేస్తున్నట్లు ప్రకటిస్తూ దానికనుగుణంగా ఒక కమిటీని వేశారు. ఆ దెబ్బకి 'టీఎస్ ఆర్టీసీ' కార్మికులు కూడా మమ్మల్నీ ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని పట్టుబట్టారు. అందుకు సీఎం కేసీఆర్ కూడా కమిటీ వేసినా, ఆ కమిటీ పట్ల సంతృప్తి చెందని ఆర్టీసీ కార్మికులు కరెక్ట్‌గా టైం చూసి సమ్మె చేయడం ప్రారంభించారు, 20 రోజులు పూర్తి చేసుకున్న ఆ సమ్మె గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కాగా, గురువారం తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) మాట్లాడుతూ టీఎస్ ఆర్టీసీ సమ్మె (TSRTC Strike)  ఒక అర్థం లేని చర్య, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయడం అంటే అంతకంటే పెద్ద 'అవివేకమైన' చర్య ఉండదని కేసీఆర్ అన్నారు. దేశం ఆర్థికమాంద్యంలో ఉన్న స్థితిలో అప్పుల్లో ఉన్న టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేయడం అర్థరహితం, ముమ్మాటికీ విలీనం చేయము. లాభాల్లోకి తీసుకురావాలంటే కొంతవరకు ప్రైవేటీకరణ జరగటమే కరెక్ట్ అంటూ సుదీర్ఘ వివరణను ఇచ్చారు. ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ లో చేశారు కదా అని జర్నలిస్టులు ప్రశ్నించినపుడు

కేసీఆర్ తనదైన స్టైల్లో " చూద్దాం కదా అక్కడో ఎక్స్ పరిమెంట్ చేశారు, అక్కడ ఏం మన్ను కూడా జరగలేదు, ఓ కమిటీ ఏషిండ్రు అది మూడు నెలలకో, ఆర్నెల్లకో రిపోర్ట్ ఇస్తదట, ఏమైతేదేమో దేవుడికెరుక, జగన్ సంగతే మైకుల చెప్తున్నా, ఎస్ ఐయామ్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్" అంటూ కమెంట్స్ చేశారు.

కేసీఆర్ ఈ కమెంట్స్ చేసిన కొన్ని గంటల్లోనే వైఎస్ జగన్ ఏపీఎస్ ఆర్టీసీ విలీనంపై ప్రక్రియ తొందరగా పూర్తిచేసేందుకు ఒక వర్కింగ్ గ్రూప్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు, 20 రోజుల్లోపే పూర్తి రిపోర్ట్ అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు ఆర్టీసీ అభివృద్ధి, లాభాలు వైఎస్ఆర్ హయాంలోనే వచ్చాయని వారి అనుబంధ మీడియాలో కథనాలు వేశారు.

దీనిని బట్టి కేసీఆర్ కమెంట్స్ జగన్ హార్ట్ కు నేరుగా తాకినట్లు అర్థమవుతుంది. ఈ ఆర్టీసీ చిచ్చు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా ఎంత దూరం పెంచేలా వెళ్తుందో చూడాలి.

గతంలో కేసీఆర్ తెలంగాణలో భారీగా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ తద్వారా పరోక్షంగా ఏపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేవారు, ఆ ఒత్తిడికి చంద్రబాబు తలొగ్గుతూ ఏపిలో కూడా అలాంటి కార్యక్రమాలను ప్రవేశ పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు రివర్స్ లో ఏపీ సీఎం జగన్ భారీగా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెడుతూ పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే కేసీఆర్ 'సీతయ్య' టైపు కాబట్టి ఆయన అలాంటి ఒత్తిడికి తలొగ్గకుండా తన పంథాను తనే అనుసరిస్తున్నారు. వీరిరువురి  రాజకీయాయణం మున్ముందు తెలుగు రాష్ట్రాల్లో రసవత్తరంగా సాగనున్నట్లు అర్థమవుతుంది.