Ranchi, August 26: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసన సభ్యత్వం (Hemant Soren disqualified as MLA) రద్దయింది. ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ శుక్రవారం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ మైనింగ్ కేసులో సోరెన్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బయాస్‌కు సిఫారసు చేసింది. దాంతో గవర్నర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద సోరెన్‌పై అనర్హత వేటు వేశారు.
తనకు తానుగా గనులను కేటాయించుకున్న హేమంత్ సోరెన్‌పై (Jharkhand Chief Minister Hemant Soren) గత కొద్ది రోజుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో హేమంత్ వ్యవహార సరళిపై కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదును కేంద్రం... ఎన్నికల సంఘానికి (Election Commission) పంపడం, హేమంత్ శాసన సభ సభ్యత్వం రద్దుకు ఈసీ సిఫారసు చేయడం, ఈసీ సిఫారసు ఆధారంగా హేమంత్ ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవడం వేగంగా జరిగిపోయాయి.
ఈ పరిణామాలతో జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. జార్ఖండ్ తదుపరి సీఎం ఎవరనే దానిపై చర్చ మొదలైంది. హేమంత్ సోరెన్ వైదొలిగితే ఆయన సతీమణికి సీఎం పదవి కట్టబెట్టే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతున్నది. ఈ ఉదయం సంకీర్ణ ప్రభుత్వ ఎమ్మెల్యేలతో సోరెన్ సమావేశమై సుధీర్ఘంగా చర్చించారు.ఇక హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు పడినా ఆయన మరో ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా గెలిచి, మిత్రపక్ష కూటమి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే తిరిగి సీఎం అయ్యే అవకాశం ఉన్నది. అయితే సోరెన్ ఏం చేస్తారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉన్నది
సీఎం హేమంత్ సోరెన్ వివాదం ఏంటంటే..?
స్టోన్ చిప్స్ మైనింగ్ లీజును తన పేరున సొరేన్ పొందారంటూ గవర్నర్ రమేశ్ బాయిస్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. గనుల మంత్రిత్వశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సొరేన్ తనకోసం తానే ఒక లీజు మంజూరు చేసుకోవడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆ పార్టీ నేత, మాజీ సీఎం రఘుబర్‌దాస్ ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 9ఏ ప్రకారం సొరేన్‌పై అనర్హత వేటు వేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని (ఈసీ) గవర్నర్ కోరారు. ఈ క్రమంలో గురువారం ఉదయం సీల్డ్ కవర్‌లో తన అభిప్రాయాన్ని ఈసీ రాజ్‌భవన్‌కు పంపించగా, శుక్రవారం సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసింది.